
India tour of New Zealand, 2022- New Zealand vs India, 1st ODI: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఇక ఈ విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.
మూడు అర్ధ శతకాలు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ వరుసగా 72, 50 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ సాధించాడు.
వీరికి తోడు సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టామ్ లాథమ్ అజేయ సెంచరీ
లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ 22, డెవాన్ కాన్వే 24 పరుగులకే అవుటయ్యారు. అయితే, ఫస్ట్‌డైన్‌లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేయగా.. టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు ఒకటి, ఉమ్రాన్ మాలిక్‌కు రెండు వికెట్లు దక్కాయి.
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మొదటి వన్డే- మ్యాచ్ స్కోర్లు:
ఇండియా- 306/7 (50)
న్యూజిలాండ్- 309/3 (47.1)
చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్
Tagenarine Chanderpaul: తండ్రికి తగ్గ తనయుడు