India tour of New Zealand, 2022 - New Zealand vs India, 3rd ODI: 12 బంతుల తేడాతో పరాజయం తప్పింది. మరో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే సిరీస్ ఫలితం 0–2గా మారేది. అయితే వానతో ఆట ఆగిపోవడంతో భారత్‌కు మూడో వన్డేలో ఓటమి ఎదురు కాలేదు. చివరకు భారత్ 0–1తో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై దాదాపు మూడేళ్లుగా వన్డే సిరీస్ చేజార్చుకోని న్యూజిలాండ్ ఆ రికార్డును నిలబెట్టుకుంది.
క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే కూడా వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 49; 8 ఫోర్లు) రాణించారు.
అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (54 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (51 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టును సునాయాస విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే 18 ఓవర్ల తర్వాత కురిసిన వర్షం ఆపై తెరిపినివ్వలేదు. ఆట ఆగిపోయే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ ఏకంగా 50 పరుగులు ముందంజలో ఉంది.
మరో రెండు ఓవర్ల ఆట సాగి ఉంటే..
అయితే వన్డే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 ఓవర్ల ఆట సాగితేనే ఫలితం తేలుతుంది. మిగతా రెండు ఓవర్ల కోసం ఎంత వేచి చూసినా వాన ఆగలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. లేదంటే టీమిండియాకు మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చేది. ఇక తొలి వన్డేలో కివీస్ గెలవగా, రెండో వన్డే కూడా రద్దయింది.
అంతకుముందు టి20 సిరీస్‌లో కూడా భారత్ ఒక మ్యాచ్ నెగ్గగా, మరో మ్యాచ్ రద్దయింది. ఇంకో మ్యాచ్ కూడా వాన కారణంగానే ‘టై’గా ముగిసి భారత్ 1–0తో సిరీస్ నెగ్గింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లలో నాలుగు వర్షం బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మొత్తానికి ఈ సిరీస్‌లో వరణుడిదే విజయం. ఆ మ్యాచ్ టై కాకుండా ఉండే హార్దిక్‌కు కూడా ధావన్ పరిస్థితే వచ్చేది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మూడో వన్డే సాగిందిలా
మూడో వన్డే వర్షం కారణంగా ఆట పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (45 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) శుబ్‌మన్ గిల్ (22 బంతుల్లో 13; 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా 10 ఓవర్ల పవర్‌ప్లేలో భారత్ 43 పరుగులే చేయగలిగింది. మరోవైపు తక్కువ వ్యవధిలో ధావన్, పంత్ (10), సూర్యకుమార్ (6) వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత శ్రేయస్ అర్ధ సెంచరీ చేజార్చుకోగా, దీపక్ హుడా (12) కూడా విఫలం కావడంతో స్కోరు 149/6కు చేరింది. ఈ దశలో స్కోరు 200 పరుగులు దాటడం కూడా కష్టమనిపించింది. అయితే సుందర్ స్ఫూర్తిదాయక బ్యాటింగ్‌తో జట్టు కోలుకుంది.
చహర్ ఓవర్లో కాన్వే నాలుగు ఫోర్లు కొట్టిన కాన్వే
స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు అలెన్, కాన్వే ధాటిగా ఆడారు. ముఖ్యంగా చహర్ ఓవర్లో కాన్వే నాలుగు ఫోర్లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇద్దరి జోరుతో 10 ఓవర్లలో స్కోరు 71 పరుగులకు చేరింది. ఈ క్రమంలో సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 51 బంతుల్లోనే అలెన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు 17వ ఓవర్లో ఈ జోడీని ఉమ్రాన్ విడదీశాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అలెన్ వెనుదిరిగాడు. అయితే మరో 9 బంతులకే ఆట ముగిసింది.
చదవండి: FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి!
ICC ODI Rankings: అదరగొట్టిన కేన్ మామ..లాథమ్! దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్‌లు
Comments
Please login to add a commentAdd a comment