ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విజయం దిశగా సాగుతున్న టీమిండియాను శార్దూల్ ఠాకూర్ భ్రష్టు పట్టించాడు. ఒకే ఓవర్‌లో 25 పరుగులు (4 ఫోర్లు, సిక్స్, 2 వైడ్లు) సమర్పించుకుని టీమిండియా కొంపముంచాడు. అప్పటి దాకా న్యూజిలాండ్ గెలుపుకు 66 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దూల్ దెబ్బకు సమీకరణలు (60 బంతుల్లో 66) ఒక్కసారిగా మారిపోయాయి. మ్యాచ్ కివీస్‌పైపు తిరిగింది.
ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన శార్దూల్‌ను టామ్ లాథమ్ ఆటాడుకున్నాడు. ఆ ఓవర్‌కు ముందు 70 బంతుల్లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న టామ్.. 40వ ఓవర్ ఆఖరి బంతికి సింగల్ తీసి కెరీర్‌లో 7వ సెంచరీ (76 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఒకే ఓవర్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది.
ఒక్క ఓవర్‌తో మ్యాచ్ మొత్తాన్ని చెడగొట్టిన శార్దూల్‌ను టీమిండియా అభిమానులు ఆడుకుంటున్నారు. ఈ మాత్రం సంబరానికి ఈయనని ఆడించడం ఎందుకని మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. బ్యాటింగ్‌లో కూడా చేసిందేమీ లేదు.. ఇలాంటి వాళ్లను ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారని సెలక్టర్లపై ధ్వజమెత్తుతున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment