
Ind Vs Nz 2021: Captain Rohit Sharma Comments on Virat Kohli Role in Rahul Dravid Era: పొట్టి ఫార్మాట్‌లో ఐసీసీ ట్రోఫీ గెలిచి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలన్న ఆశ తీరకుండానే విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అదే విధంగా భారత హెడ్‌కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి సైతం కోచింగ్ కెరీర్‌లో ఒక్క మేజర్ ట్రోఫీ కూడా గెలవకుండానే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఇక వారిద్దరి స్థానంలో సారథిగా రోహిత్ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ఇన్నాళ్లు టీ20 కెప్టెన్‌గా ఉన్న కోహ్లి... ఈ ఫార్మాట్‌లో బ్యాటర్‌గా కొనసాగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ హోదాలో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ... ‘‘జట్టులో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తను. ప్రతి మ్యాచ్‌లోనూ తన ప్రభావం ఉంటుంది. తన మార్కు చూపిస్తాడు. సుదీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందిస్తున్నట్లుగానే ఇప్పుడూ అలాగే ముందుకు సాగుతాడు. తను జట్టులో ఉంటే మాకు బలం. తన అనుభవం మాకు ఎంతగానో ఉపకరిస్తుంది.
అయితే, జట్టులో ఒక్కొక్కరి పాత్ర ఒక్కోలా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేస్తే ఆర్డర్ ఒకలా... ఛేజింగ్ చేస్తే మరోలా.. వీటిపైనే ఆర్డర్ మార్చాలా వద్దా అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి. కోహ్లి లాంటి అద్భుతమైన బ్యాటర్ ఉంటే జట్టుకు విలువ. అదనపు బలం. తన పాత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నవంబరు 17 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఇక ఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి సహా పలువురు క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: Rahul Dravid: అక్కడ కోచింగ్ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తానంటే కుదరదు కదా.. నాకు ఆ ఆలోచనే లేదు!