టీమిండియాతో టెస్టులకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ బెన్ సియర్స్(Ben Sears) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. సియర్స్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ జాకోబ్ డఫీ(Jacob Duffy)ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. బెంగళూరు వేదికగా అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.
మోకాలి గాయం
అయితే, తొలి టెస్టు ఆరంభానికి ముందే న్యూజిలాండ్ యువ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం తీవ్రమైంది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా 26 ఏళ్ల సియర్స్ ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.
అనంతరం.. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. అయితే, రెండో టెస్టు సమయంలో మోకాలి నొప్పితో అతడు ఇబ్బందిపడ్డాడు. వైద్య పరీక్షల ఫలితాలు తాజాగా వెలువడగా.. ఆటకు కొంతకాలం దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.
పేస్ విభాగం పటిష్టంగానే
ఇక సియర్స్ టీమిండియాతో సిరీస్‌కు సియర్స్ లేకపోయినా.. న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగానే ఉంది. వెటరన్ బౌలర్ టిమ్ సౌతీతో పాటు ఎమర్జింగ్ పేసర్ విలియం ఒ రూర్కీ జట్టుతో ఉన్నారు. అంతేకాదు.. మీడియం పేసర్‌గా డారిల్ మిచెల్ కూడా సేవలు అందించగలడు. ఈ క్రమంలో సియర్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాకోబ్ డఫీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం లేదు.
టీమిండియాతో టెస్టు సిరీస్-2024కు న్యూజిలాండ్ జట్టు(అప్‌డేటెడ్)
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
న్యూజిలాండ్‌తో టెస్టులకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment