న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి టెస్టు తాలుకు పొరపాట్లు పునరావృతం చేయకుండా.. రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పుణెలో గురువారం నుంచి మొదలుకానున్న ఈ టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన సిరీస్ బరిలో నిలుస్తుంది. లేదంటే.. పర్యాటక జట్టుకు 0-2తో ట్రోఫీని సమర్పించుకోకతప్పదు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కివీస్ చేతిలో సొంతగడ్డపై దాదాపు 36 ఏళ్ల తర్వాత ఓటమికి ప్రధాన కారణం టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్చి నిర్ణయాలే అని ఘాటు విమర్శలు చేశాడు.
కామన్‌సెన్స్ లేదా?
ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో కొన్నిసార్లు అర్థమే కాదు. కామన్‌సెన్స్ లోపించిందేమో అనిపిస్తుంది. అసలు ఆ కోచ్, కెప్టెన్ ఏం నిరూపించాలనుకుంటున్నారనేది నాకైతే అంతుపట్టడం లేదు. కొత్త కోచ్ వచ్చినా.. కొత్త కెప్టెన్ వచ్చినా.. తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు’’ అని మనోజ్ తివారి విమర్శించాడు.
కోచ్ ఏం చేస్తున్నాడు?
బెంగళూరు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు ఎక్కువగా బంతిని ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి స్పిన్నర్లతో తక్కువ బంతులు వేయిస్తారని తెలుసు. అయితే, అందుకోసం ఏకంగా అశ్విన్‌నే పక్కనపెడతారని అనుకోలేదు. టెస్టుల్లో ఐదు వందలకు పైగా అతడు వికెట్లు తీశాడు. 107 రూపంలో కనిపిస్తున్న స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రాతో కలిపి అశ్విన్‌ను కూడా ఆడించాల్సింది.
గొప్ప కెప్టెన్లుగా పేరొందిన వారు కూడా తప్పులు చేస్తారు. అలాంటి సమయంలో కోచ్ ముందుకు రావాలి. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు నడిపించాలి. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ అలా జరుగలేదు అనిపిస్తోంది’’ అని మనోజ్ తివారి గంభీర్‌ను తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. కాగా కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టాస్ గెలిచినప్పటికీ పిచ్‌ను తప్పుగా అంచనా వేసి తాము భారీ మూల్యం చెల్లించినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్ల మధ్య పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు విశేషాలు
👉షెడ్యూల్: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటక
👉వర్షం కారణంగా బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు
👉రెండో రోజు మొదలైన ఆట
👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 46 ఆలౌట్
👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 402 ఆలౌట్
👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 462 ఆలౌట్
👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 110/2
👉ఫలితం: టీమిండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర(134, 39*).
Comments
Please login to add a commentAdd a comment