స్వదేశంలో న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (జనవరి 18) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలి వన్డేకు కొద్ది గంటల ముందు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగడంతో (వన్డే సిరీస్ మొత్తానికి) అప్పటివరకు తుది జట్టులో ప్లేస్ గ్యారెంటీ లేని సూర్యకుమార్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
బీసీసీఐ.. శ్రేయస్ స్థానాన్ని రజత్ పాటిదార్‌తో భర్తీ చేసినప్పటికీ, అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయడం దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది. దీంతో స్కై ఐదో స్థానంలో బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యకుమార్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నప్పటికీ, వన్డేల్లో సీనియర్ల హవాతో అతనికి తుది జట్టులో చోటు లభించడం లేదు.
ఇటీవల లంకతో జరిగిన మూడో టీ20లో స్కై విధ్వంసకర శతకం బాదినప్పటికీ.. అదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం లభించలేదు. కివీస్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూర్యకు స్థానం లభించినప్పటికీ.. అతనికి బలమైన పోటీదారుగా శ్రేయస్ ఉండి ఉండటంతో స్కై ఆశలు వదులుకున్నాడు. అయితే అనూహ్యంగా శ్రేయస్ గాయపడటంతో సూర్యకు వన్డే సిరీస్ మొత్తం ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ విషయాన్ని పక్కకు పెడితే.. కివీస్‌తో తొలి వన్డే బరిలో దిగబోయే భారత తుది జట్టు (అంచనా) ఎలా ఉండబోతుందంటే.. కేఎల్ రాహుల్ పెళ్లి నిమిత్తం సెలవులో ఉండటంతో వికెట్‌కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ కోసం పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తన వన్‌డౌన్ స్థానాన్ని త్యాగం చేయవచ్చు.
గిల్ వన్‌డౌన్‌లో వస్తే కోహ్లి నాలుగో స్థానంలో, సూర్యకుమార్ ఐదో ప్లేస్‌లో, ఆతర్వాత హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ టీమిండియా అదనపు స్పిన్నర్‌ను బరిలోకి దించాలని భావిస్తే ఉమ్రాన్ మాలిక్ ప్లేస్‌లో చహల్ తుది జట్టులోకి రావచ్చు. హైదరాబాద్ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment