Sakshi News home page

Sanju Samson: పంత్‌ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

Published Wed, Nov 30 2022 5:17 PM

Ind Vs NZ ODI: VVS Laxman Reveals Reason Behind Backing Pant - Sakshi

India Vs New Zealand- Rishabh Pant- Sanju Samson- BCCI: ‘‘విఫలమవుతున్నా రిషభ్‌ పంత్‌కు ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారు? ప్రతిభ ఉన్నా మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఆటగాళ్ల విషయంలో ఈ వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు?’’.. గత కొన్నాళ్లుగా భారత తుది జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేస్తూ అభిమానులు అంటున్న మాటలివి.

పాపం సంజూ
ప్రపంచకప్‌-2022 టోర్నీలో విఫలమైన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ న్యూజిలాండ్‌ టూర్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 సిరీస్‌లో విఫలమైన అతడు.. వన్డే సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 

మరోవైపు.. తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. ఎప్పుడో ఓసారి మాత్రమే టీమిండియాకు ఎంపికయ్యే మరో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. టీ20 సిరీస్‌కు పూర్తిగా అతడిని పక్కనపెట్టిన యాజమాన్యం.. మొదటి వన్డేలో మాత్రమే ఆడించింది.   

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పంత్‌, సంజూల పేర్లు ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా కివీస్‌తో మూడో వన్డేలో విఫలమైన పంత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్‌ను ట్రోల్‌ చేస్తూ.. సంజూను సమర్థిస్తూ బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు ఫ్యాన్స్‌.

పంత్‌ అద్భుతం.. అండగా నిలబడతాం
ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు తాత్కాలిక కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పంత్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘పంత్‌ నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు.

ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో అతడు విలువైన సెంచరీ చేసి మరీ ఎక్కువ రోజులేం కావడం లేదు కదా! తనకు కచ్చితంగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. టీ20 క్రికెట్‌లో మెరవడం ద్వారా బ్యాటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. 

మైదానాలు పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేకుండా హిట్టింగ్‌ ఆడే అవకాశం దొరుకుతుంది. నిజానికి ఒక ఆటగాడికి ఎందుకు వరుసగా చాన్స్‌ ఇస్తున్నామో.. ఒక్కోసారి వాళ్లను ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో వాళ్లకు సమాచారం ఇస్తూనే ఉంటాం’’ అని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించాడు. 

నాడు జట్టును గెలిపించిన పంత్‌
ఈ ఏడాది జూలైలో మాంచెసర్ట్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పంత్‌ సెంచరీ బాదాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు 16 సిక్స్‌లు, 2 ఫోర్ల సాయంతో 125 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 

ఇలా పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. ట్రోఫీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మణ్‌.. పంత్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం. ఇక తాజాగా కివీస్‌తో మూడో వన్డేలోనూ పంత్‌ 10 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కాగా ఆతిథ్య జట్టు 1-0తో ట్రోఫీ గెలిచింది.

చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!
ICC ODI Rankings: అదరగొట్టిన కేన్‌ మామ..లాథమ్‌! దిగజారిన కోహ్లి, రోహిత్‌ ర్యాంక్‌లు

Advertisement

What’s your opinion

Advertisement