
అయ్యో విహారి.. టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది.
Ind Vs Nz Test Series- Why Hanuma Vihari Not Selected: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ చిత్రంగా సంప్రదాయ ఫార్మాట్‌లో ఇంటాబయటా రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసింది. మొత్తం టెస్టు సిరీస్ నుంచే అతన్ని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మరో తెలుగు ప్లేయర్, కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు కట్టబెట్టారు.
ఇతనితో పాటు బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ ప్రసిధ్ కృష్ణలకూ తొలి సారి టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వీరిద్దరు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇది వరకే టీమిండియా జెర్సీ వేసుకున్నారు. దీంతో పూర్తిగా కొత్త ముఖమైతే శ్రీకర్ భరత్‌దే! నాలుగేళ్ల తర్వాత ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కానున్న మొదటి మ్యాచ్‌కు రహానే సారథ్యం వహించనున్నాడు. తిరిగి రెండో టెస్టుకు కోహ్లినే పగ్గాలు చేపడతాడు.
రోహిత్, పంత్, బుమ్రా, షమీలకు విశ్రాంతి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్టార్ ఆటగాళ్లపై క్రికెట్ భారం తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగానే టి20 కొత్త సారథి రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్, పేసర్లు బుమ్రా, షమీలకు ఐదు రోజుల ఫార్మాట్‌లో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
ఈ నెల 17 నుంచి జరిగే మూడు టి20ల సిరీస్ నుంచి కోహ్లికి కూడా ఇది వరకే రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్‌తో కోహ్లి కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడతాడు. టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రెండో కీపర్‌గానే భరత్‌ను తీసుకున్నట్లు తెలిసింది.
భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
దెబ్బకు దిగొచ్చారు.. ట్వీట్‌తో సరిపెట్టారు...
టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్లపై రాణించిన ఘనత మన విహారిది. తొడ కండరాల గాయం బాధిస్తున్నా... జట్టు అవసరాల కోసం గాయాన్ని పంటిబిగువన భరించి మరీ ఓ టెయిలెండర్ (అశ్విన్)తో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత్‌ను ‘డ్రా’తో గట్టెక్కించాడు. అందరి నుంచీ ప్రశంసలందుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు.
ఫైనల్లో భారత ఓటమికి విహారిలాంటి నిలబడే బ్యాట్స్‌మన్ లేకపోవడం కూడా ఒక కారణం. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ విహారిని పక్కన బెట్టారు. ఈసారి సెలెక్షన్ కమిటీ ఏకంగా జట్టు నుంచే తప్పించింది. దీనికి సరైన కారణం కూడా సెలక్షన్ కమిటీ, బోర్డు దగ్గర లేదు. దీనిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకు విహారిని భారత్ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నామని శుక్రవారం సాయంత్రం బీసీసీఐ ఒక ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈనెల 9న భారత ‘ఎ’ జట్టును ప్రకటించినపుడు అందులో విహారి పేరు లేకపోవడం గమనార్హం. విహారి తన కెరీర్‌లో 12 టెస్టులు ఆడి 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Virat Kohli: మిగిలిన ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం!
🚨 UPDATE: @Hanumavihari has been added to the India 'A' squad for the South Africa tour. https://t.co/ISYgtlw1S1 pic.twitter.com/uy3UD1pCN5
— BCCI (@BCCI) November 12, 2021