భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు దేవీ నవరాత్రులకు మొదటి రోజు కావటం, అందులోనూ ఈ పండుగను ఘనంగా జరుపుకునే అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే దయాదుల సమరాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తుంది.
దీనిపై బీసీసీఐ కూడా స్పందించినట్లు సమాచారం. భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పు అంశం పరిశీలనలో ఉన్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
భారత్-పాక్ లాంటి హైప్రొఫైల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌కు చేరుకుంటారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగితే దేవీ నవరాత్రుల పండుగ కారణంగా విధించే అంక్షల కారణంగా ఫ్యాన్స్ ఇబ్బందులకు గురవుతారని సెక్యూరిటీ ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దాయాదుల సమరాన్ని షెడ్యూల్ తేదీకి ఒక రోజు ముందు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఏదిఏమైనా షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే మాత్రం ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారు, ముందస్తుగా అహ్మదాబాద్‌లో వసతి ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా ఇబ్బందులకు గురవుతారు.
Comments
Please login to add a commentAdd a comment