చెలరేగిన ప్రొటిస్‌ పేసర్లు.. రోహిత్‌ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే | Ind Vs SA 1st Test Day 3: South Africa Beat India By Innings 32 Runs, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

Ind Vs SA 1st Test Highlights: చెలరేగిన ప్రొటిస్‌ పేసర్లు.. రోహిత్‌ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే

Published Thu, Dec 28 2023 8:45 PM | Last Updated on Fri, Dec 29 2023 1:19 PM

Ind vs SA 1st Test Day 3: South Africa Beat India By Innings 32 Runs - Sakshi

సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది.

సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 32 పరుగుల  తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాపై మరోసారి ఆధిపత్యం చాటుకున్న సౌతాఫ్రికా మూడో రోజే ఆటను ముగించి సత్తా చాటింది.  ప్రొటిస్‌ సెంచరీ హీరో డీన్‌ ఎల్గర్‌(185) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.


మంగళవారం మొదలైన బాక్సింగ్‌ డే టెస్టులో టాస్‌ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కఠినమైన సెంచూరియన్‌ పిచ్‌పై ప్రొటిస్‌ పేసర్ల విజృంభణతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

స్టార్‌ బ్యాటర్లు, అనుభవజ్ఞులు అయిన ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(5), విరాట్‌ కోహ్లి(38) విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్‌ రాహుల్‌ అసాధారణ పోరాటం కనబరిచాడు. అర్ధ శతకంతో రాణించి తొలి రోజు ఆటను ముగించాడు.


అయితే రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌ నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ చరమాంకానికి చేరుకుంది.  67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతడికి తోడుగా అరంగేట్ర బ్యాటర్‌ బెడింగ్‌హామ్‌ అర్ధ శతకం (56)తో రాణించాడు. ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.


ఇక మూడో రోజు ఆటలో భాగంగా 408 పరుగులకు ఆలౌట్‌ అయి ఆధిక్యాన్ని 163 పరుగులకు పెంచుకుంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను ప్రొటిస్‌ పేసర్లు దెబ్బకొట్టారు. కగిసో రబడ రోహిత్‌ శర్మను డకౌట్‌ చేసి శుభారంభం అందించగా.. నండ్రీ బర్గర్‌ యశస్వి జైస్వాల్‌(5)ను పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌(26)ను పెవిలియన్‌కు పంపిన మార్కో జాన్సెన్‌.. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌(6)ను కూడా అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి ఆచితూచి నిలకడగా ఆడాడు.

అయితే, కేఎల్‌ రాహుల్‌(4) అవుటైన తర్వాత టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనం వేగం పుంజుకుంది. రాహుల్‌ను అవుట్‌ చేసిన మరుసటి బంతికే బర్గర్‌.. అశ్విన్‌ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత రబడ శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా.. కోహ్లితో సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్‌ అయ్యాడు.

సిరాజ్‌ 4 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. ప్రసిద్‌ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. అయితే, 34.1వ ఓవర్‌ వద్ద మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో కోహ్లి రబడకు క్యాచ్‌ అవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్‌ నాలుగు వికెట్లు తీయగా.. రబడకు రెండు, మార్కో జాన్సెన్‌కు‌ మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్‌, రబడ పాలు పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement