శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికాను యువ ఓపెనర్ టోనీ జోర్జీ (119) అజేయమైన శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 21న జరుగనుంది.
శతక్కొట్టిన టోనీ జోర్జీ
దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ టోనీ జోర్జీ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోనీకి కెరీర్‌లో ఇది తొలి సెంచరీ. 37 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 187/1.
ఎట్టకేలకు తొలి వికెట్ పడింది..
212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 130 పరుగుల వద్ద (27.5వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (52) ఔటయ్యాడు. టోనీ జోర్జీ (75), డస్సెన్ క్రీజ్‌లో ఉన్నారు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోర్జీ
సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ జోర్జీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 18 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 77/0గా ఉంది.
టార్గెట్ 212.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా
212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. టోనీ డి జర్జీ (21), రీజా హెండ్రిక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
211 పరుగులకు ఆలౌటైన టీమిండియా
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్ (9) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నంబ్రే బర్గర్ 3, హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ చెరో 2, లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
186 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు.
పేక మేడలా కూలుతున్న టీమిండియా
ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన టీమిండియా, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంది. 172 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (1) ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
169 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రింకూ సింగ్ (17) స్టంపౌటయ్యాడు.
167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ (56) ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు.
సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్
136 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సాయి సుదర్శన్ ఔట్
114 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్
టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ తన వన్డే కెరీర్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకం సాధించిన సుదర్శన్.. రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2గా ఉంది. సుదర్శన్‌తో పాటు కేఎల్ రాహుల్ (15) క్రీజ్లో ఉన్నాడు.
నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్
టీమిండియా బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54/2గా ఉంది. సాయి సుదర్శన్ (36), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
46 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన తిలక్ వర్మ.. బర్గర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కెప్టెన్ రాహుల్ వచ్చాడు.
రెండో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో బంతికే వికెట్ కోల్పోయింది. నంబ్రే బర్గర్ బౌలింగ్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన రుతురాజ్ ఆతర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రుతురాజ్ రివ్యూకి వెళ్లడంతో భారత్ ఓ రివ్యూ కోల్పోయింది.
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకటి, సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని రింకూ సింగ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్‌తో రింకూ వన్డే అరంగట్రేం చేయనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి స్థానాల్లో బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment