టీమిండియా (PC: BCCI X)
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.
టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది.
36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది.
రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు.
సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.
చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment