
Virat Kohli: పంత్ గుణపాఠాలు నేర్చుకుంటాడు.... ఇక రహానే, పుజారా..
‘‘రిషభ్ పంత్ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. మేటి క్రికెటర్‌గా తనను తాను నిరూపించుకుంటాడు. తనతో మేము ఇప్పటికే మాట్లాడాం. తను పరిణతి కలిగిన ఆటగాడు. కచ్చితంగా పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు’’ అని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. మూడో టెస్టుకు పంత్ తుది జట్టులో ఉంటాడని సంకేతాలు ఇచ్చాడు.
కాగా రెండో టెస్టులో నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ సమర్పించుకున్న పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆఖరి టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లి... ప్రతి ఆటగాడు తప్పులు చేయడం సహజమంటూ పంత్‌ను వెనకేసుకొచ్చాడు. తప్పులు సరిదిద్దుకుని మెరుగ్గా రాణించగలడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక సీనియర్ బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే గురించి చెబుతూ... ‘‘జట్టులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి సహజంగా జరగాలే గానీ.. బలవంతంగా మార్పులు చేయకూడదు’’ అన్నాడు. మూడో టెస్టు నేపథ్యంలో వీరిద్దరు తుది జట్టులో ఉంటారని చెప్పకనే చెప్పాడు. కాగా కేప్‌టౌన్ వేదికగా జరిగే నిర్ణయాత్మక మూడో టెస్టు జనవరి 11న ఆరంభం కానుంది.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే...