దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్- టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్(PC: BCCI)
South Africa vs India, 1st T20I: ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటననూ ఘనంగా ఆరంభించాలని భావించింది. అయితే, ఆదిలోనే వరుణుడు సూర్యకుమార్ సేనకు అడ్డుపడ్డాడు. ప్రొటిస్ గడ్డపై కఠిన సవాలు ఎదురవుతుందనుకుంటే ఎడతెరిపిలేని వర్షంతో తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. అదేపనిగా వాన కురవడంతో పిచ్‌పై కప్పి ఉంచిన కవర్స్‌ను తీయాల్సిన అవసరమే రాలేదు.
కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్‌ను అస్వాదించవచ్చని ఎదురుచూస్తూ మైదానంలో గొడుగుల కిందే గడిపిన క్రికెట్ ప్రియుల ఆశలపై నీళ్లు పడ్డాయి. ఆగని వాన వల్ల కనీసం టాస్ కూడా వేసే అవకాశం లేకపోయింది. దీంతో మైదానంలో ఆడాల్సిన ఇరుజట్ల ఆటగాళ్లు... డ్రెస్సింగ్ రూమ్‌లలో సగటు ప్రేక్షకుల్లానే మిగిలిపోయారు.
అభిమానులకు తప్పని నిరాశ
వాతావరణ పరిస్థితిని సమీక్షించిన ఫీల్డ్ అంపైర్లు బాన్‌గని జెలె, స్టీఫెన్ హారిస్ రెండు గంటల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షం ఇంకా కొనసాగడం, అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా ఉండటంతో ఇక మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేదని, ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెరుపులు చూడాలనుకున్న అభిమానులంతా చినుకులతో విసిగి నిరాశగా వెనుదిరిగారు.
వర్షం కారణంగా.. కింగ్స్‌మేడ్ మైదానంలో జరగాల్సిన తొలి టీ20 రద్దు (PC: BCCI)
సీఎస్‌ఏపై గావస్కర్ ఫైర్
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ) తీరుపై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్థికంగా తమకు ఎంతో ముఖ్యమైన సిరీస్ అని చెప్పిన సీఎస్‌ఏ.. ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు.
తొలి టీ20 సమయంలో.. ఒకవేళ వర్షం ఆగిపోయినా ఆట కొనసాగకపోయేదని.. అప్పటికే గ్రౌండ్ మొత్తం తడిచిపోయిందని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ విషయం గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘మైదానం మొత్తం కవర్ చేయనేలేదు. వర్షం తెరిపినిచ్చినా మరో గంట.. రెండు గంటల వరకు మ్యాచ్ కొనసాగే పరిస్థితి కనిపించలేదు. అంతలోనే మళ్లీ వర్షం పడింది.
బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు మీకు లేకపోవచ్చు.. కానీ
కాబట్టి మ్యాచ్ రద్దు చేశారు. నిజానికి ప్రతి క్రికెట్ బోర్డు దగ్గర చాలానే డబ్బు ఉంది. ఒకవేళ ఈ మాట తప్పని ఎవరైనా చెబితే వారు అబద్ధం ఆడుతున్నట్లే లెక్క! అయితే, అందరి దగ్గరా బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు లేకపోవచ్చు.
అయితే, ప్రతి బోర్డు దగ్గర కనీసం గ్రౌండ్ తడవకుండా కాపాడే కవర్లు కొనుగోలు చేసేంత సొమ్ము అయినా ఉంటుంది కదా!’’ అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు.
టీమిండియాతో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావించినపుడు కనీస ఏర్పాట్లైనా చేసి ఉండాల్సిందని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగనుంది.
చదవండి: #Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ!
Comments
Please login to add a commentAdd a comment