ICC Mens T20 World Cup 2022- India vs South Africa: ‘‘ఇండియా మా సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. భారత్ పరాజయం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అయినా ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. మేమే చెత్తగా ఆడి.. మా తలరాతను ఇతరులు నిర్ణయించే దుస్థితిలో ఉన్నాం’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లయింది. అద్భుతాలు జరిగితే తప్ప బాబర్ ఆజం బృందం టోర్నీలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీలో పాక్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు.
టీమిండియా మమ్మల్ని నిరాశపరిచింది
అదే సమయంలో రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఉంటే తమకు కాస్త మేలు చేసిన వాళ్లు అయ్యేవారంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించిన అక్తర్.. ‘‘పెర్త్ లాంటి పిచ్‌లపై ఆడటం కాస్త కష్టమే.
ఏదేమైనా టీమిండియా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. భారత బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడి ఉంటే బాగుండేది. పెవిలియన్‌కు క్యూ కట్టకుండా.. కనీసం 150 పరుగులు స్కోరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది.
మమ్మల్ని కూడా ఓడిస్తారు!
అయితే, దక్షిణాఫ్రికా తన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలను చక్కగా ఉపయోగించుకుంది. మిల్లర్ నిజంగా కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కరమ్‌తో కలిసి తన అనుభవన్నంతా ఉపయోగించి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లుంగి ఎంగిడి అద్భుతాలు చేయగలడని మరోసారి నిరూపించాడు.
నిజానికి ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే మాకు ఆశలు మిగిలి ఉండేవి. కానీ అలా జరుగలేదు. ఇక సౌతాఫ్రికా ఇప్పుడు.. టీమిండియా లాగే మమ్మల్ని సైతం ఓడించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ స్కోర్లు:
ఇండియా- 133/9 (20)
దక్షిణాఫ్రికా- 137/5 (19.4)
5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లుంగి ఎంగిడి(4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)
చదవండి: T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు..
T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా
Comments
Please login to add a commentAdd a comment