కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన టీమిండియా పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆడుతూ పాడుతూ చేధించింది.
ఈ సంగతి పక్కనపెడితే.. భారత్ ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టుగా, వ్యక్తిగతంగా పలు చెత్త రికార్డులను నమోదు చేసింది. లంకతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగులు చేయడం ద్వారా ఐదేళ్ల తర్వాత అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2016లో నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ టీ 20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం మళ్లీ ఇదే. ఇక భారత్‌కు టీ20ల్లో అత్యల్ప స్కోరు 74.. 2008లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు చేసింది. ఇక టీ20ల్లో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుగా చూస్తే భారత్ రెండో స్థానంలో ఉంది. 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 79 పరుగులతో తొలి స్థానంలో ఉంది. ఇక భువనేశ్వర్ బ్యాట్స్‌మన్‌గా ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. 32 బంతులాడిన భువీ తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కొట్టకుండానే ఔటయ్యాడు. ఇంతకముందు ఇర్ఫాన్ పఠాన్ 30 బంతులు, ఎంఎస్ ధోని 27 బంతుల పాటు బౌండరీలు కొట్టలేకపోయారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఏడుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో ధావన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. లంక బౌలర్ వినిందు హసరంగ 4 వికెట్లతో దుమ్మురేపాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment