IND Vs WI 2022, 1st T20I: Nicholas Pooran Says Disappointed As A Team And Players Feeling Hurt After Loss Match - Sakshi
Sakshi News home page

Rohit Sharma: అద్భుతంగా ముగించాం..! మేము చాలా హర్ట్‌ అయ్యాం! అయినా ఇది ఆరంభమే!

Published Sat, Jul 30 2022 10:10 AM | Last Updated on Sat, Jul 30 2022 11:50 AM

Ind Vs WI 1st T20 Rohit Sharma: It Was Great Finish Pooran Says Feeling Hurt - Sakshi

రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌(PC: BCCI)- నికోలస్‌ పూరన్‌(PC: CWI)

India Vs West Indies 1st T20- Rohit Sharma Comments: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ట్రినిడాడ్‌ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 68 పరుగులతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇక రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌(44 బంతుల్లో 64 పరుగులు)కు తోడు వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అద్భుతంగా రాణించాడు. 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ మేరకు వీరిద్దరు అద్భుతంగా రాణించడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యం విధించింది.

విండీస్‌ బ్యాటర్ల విలవిల..
ఇక భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది. విండీస్‌ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు వరుసగా 15, 20, 0, 18, 14, 14, 11,0,19(నాటౌట్‌),5(నాటౌట్‌). దీంతో 122 పరుగులకే నికోలస్‌ పూరన్‌ బృందం కథ ముగిసింది. 68 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 

కాగా విండీస్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ బ్రూక్స్‌ 20 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువనేశ్వర్‌ కుమార్‌కు ఒకటి, అర్ష్‌దీప్‌ సింగ్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఒకటి, అశ్విన్‌కు రెండు, రవి బిష్ణోయికి రెండు వికెట్లు దక్కాయి. ఇక తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన దినేశ్‌ కార్తిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

సంతోషంగా ఉంది!
ఈ విజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. ‘‘మొదటి 10 ఓవర్లు ముగిసిన తర్వాత 190 స్కోరు చేయగలమని మేము అనుకోలేదు. అయితే, మా వాళ్లు అద్భుతంగా ఆడారు. ఘనంగా మ్యాచ్‌ను ముగించారు.

కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటాం. నిజానికి ఇలాంటి పిచ్‌ను అంచనా వేయడం కష్టం. మా బలాలు, నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుంటాం. వెస్టిండీస్‌లో ఆడటం నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన టీమిండియా అభిమానులు, స్థానికులు కూడా మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.

ఈ స్టేడియం ‘కొత్తది!
వెస్టిండీస్‌- టీమిండియా మ్యాచ్‌ జరిగిన వేదిక ట్రినిడాడ్‌లోని టరౌబాలో గల బ్రియన్‌ లారా స్టేడియం. ఇక్కడ గతంలో మూడు మహిళా క్రికెట్‌ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అదే విధంగా కరేబియన్‌ లీగ్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లకు ఇది వేదికైంది. ఇక టీమిండియా ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌ జట్టుకు కూడా ఇదే మొదటి మ్యాచ్‌.

మా వాళ్లు చాలా హర్ట్‌ అయ్యారు!
‘‘పూర్తిగా నిరాశ చెందాం. మా వాళ్లు చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా సిరీస్‌లో ఇది మొదటి మ్యాచ్‌ కదా! లోపాలు సరిదిద్దుకుని పునరుత్తేజంతో మిగిలిన మ్యాచ్‌లు ఆడతాం. వాళ్లు 150 స్కోరుకు చేరువైనపుడే మా నుంచి మ్యాచ్‌ లాగేశారనిపించింది.

మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పే కాంబినేషన్లు మాకూ కావాలి. అప్పుడే అనుకున్న ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలం’’ అని వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ అన్నాడు.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా తొలి టీ20:
►వేదిక: బ్రియన్‌ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్‌
►టాస్‌: వెస్టిండీస్‌- బౌలింగ్‌
►ఇండియా స్కోరు: 190/6 (20)
►వెస్టిండీస్‌ స్కోరు:  122/8 (20)
►విజేత: ఇండియా... 68 పరగుల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: దినేశ్‌ కార్తిక్‌(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు)
చదవండి: NZ vs SCO: తమ టి20 చరిత్రలో అత్యధిక స్కోరు.. స్కాట్లాండ్‌పై భారీ విజయం
Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement