West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్‌లోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ద్విశతకం దిశగా అడుగులు వేస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. అరంగేట్రంలోనే అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.
కాగా దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ఆడుతున్న యశస్వి జైశ్వాల్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 సందర్భంగా తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకోవడం యశస్వికి కలిసి వచ్చింది. ఈ క్రమంలో జూలై 12న టీమిండియా- విండీస్ మధ్య ఆరంభమైన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఈ యువ ఆటగాడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకుని 143 పరుగుల వద్ద నిలిచిన యశస్వి.. మూడో రోజు తొలి సెషన్‌లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులోనే అత్యంత పిన్న వయసులోనే ఈ మార్కు అందుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ క్రీజులో పాతుకుపోయి చుక్కలు చూపించాడు. పార్ట్ టైమ్ బౌలర్లతో సహా ఉన్న వాళ్లందరినీ దింపినప్పటికీ ఒక్కరికీ చిక్కలేదు. అయితే, మూడో రోజు తొలి సెషన్‌లో 171 పరుగుల వద్ద ఉన్న సమయంలో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పదే పదే ఒకే చోట బాల్ వేస్తూ యశస్విని విసిగించాడు.
126వ ఓవర్ ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోటాపోటీ యుద్ధమే జరిగింది. ఈ ఓవర్లో యశస్వి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఓపికతో ఎదురుచూసిన అల్జారీ జోసెఫ్ ఆఖరి బంతికి అనుకున్నది సాధించాడు. 125.6వ డెలివరీ(outside off)లో యశస్వి బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి జోషువా డా సిల్వా చేతుల్లో పడింది.
దీంతో యశస్వి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక వచ్చీ రాగానే వైస్ కెప్టెన్ అజింక్య రహానే కేవలం 3 పరుగులు చేసి అవుటయ్యాడు. రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
చదవండి: కోహ్లి నెమ్మదిగా! సీనియర్ అయి ఉండి ఏం లాభం?: ఇషాంత్ శర్మ
IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్
Comments
Please login to add a commentAdd a comment