వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకునేందుకు భారత జట్టు సన్నద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా మూడు వన్డేలతో పాటు తొలి టి20లో కూడా అలవోక విజయం సాధించింది. విండీస్ నుంచి ఏ దశలోనూ కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. ఈ నేపథ్యంలో నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్లు రెండో టి20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఫామ్‌ను బట్టి చూస్తే భారత్ మరోసారి సంపూర్ణ ఆధిక్యం కనబర్చే అవకాశం కనిపిస్తోంది. వన్డేలతో పోలిస్తే టి20ల్లో కాస్త మెరుగైన, హిట్టర్లతో కూడిన జట్టయిన విండీస్ ఈ ఫార్మాట్‌లోనూ గత మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఈ సారైనా కాస్త మెరుగ్గా రాణించి పర్యాటక జట్టు సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్ వరకు తీసుకెళుతుందా చూడాలి.
కోహ్లి చెలరేగేనా!
సహజంగానే గెలిచిన జట్టునే కొనసాగించే అలవాటు ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మార్పులకు ఆసక్తి చూపించకపోవచ్చు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రతీ మ్యాచ్‌లో సన్నద్ధమవుతామని చెప్పిన రోహిత్... అందుకు అనుగుణంగా తన ప్రణాళికల ప్రకారం తుది జట్టును ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ ప్రదర్శన చూస్తే భారత్ ఆందోళన చెందే అంశం ఏమీ లేదు.
రోహిత్, ఇషాన్ కిషన్, పంత్, సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఒక్క విరాట్ కోహ్లి ఫామ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నా... అతని స్థాయికి ఒక్క ఇన్నింగ్స్‌తో అంతా మార్చేయగలడు. విండీస్‌తో గత నాలుగు ఇన్నింగ్స్‌లలో కోహ్లి వరుసగా 8, 18, 0, 17 పరుగులు చేశాడు.
ఇక స్పిన్నర్లలో చహల్ ప్రభావం చూపించగా, రవి బిష్ణోయ్ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. అయితే ముగ్గురు పేసర్లు కూడా దాదాపు ఒకే తరహా వేగంతో బౌలింగ్ చేసేవారు కావడంతో వైవిధ్యం కోసం ఒక మార్పుకు అవకాశం ఉంది. భువనేశ్వర్ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని తప్పించి సిరాజ్‌ను ఎంచుకోవచ్చు.
చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి
Comments
Please login to add a commentAdd a comment