కోచ్, సహచర ఆటగాళ్లతో నికోలస్ పూరన్(PC: CWI)
West Indies vs India, 2nd T20I: వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. మొదటి టీ20 మ్యాచ్‌లో పరాజయంతో మరింత కుంగిపోయింది. వన్డే మ్యాచ్‌లలో గట్టి పోటీనిచ్చినా తమకు కలిసి వచ్చిన టీ20 ఫార్మాట్‌లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఖరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు.
జేసన్ హోల్డర్ పందొమ్మిదో ఓవర్లో 21 పరుగులు ఇస్తే.. ఆఖరి ఓవర్లో ఒబెడ్ మెకాయ్ 15 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వరుసగా 1,0,6,4,0,4 బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 122 పరుగులకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. ఫలితంగా 68 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
వాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు!
ఈ నేపథ్యంలో సోమవారం నాటి(ఆగష్టు 1) రెండో టీ20 ఆరంభానికి ముందు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండటం లేదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.
లోపాలు సరిచేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మేలో నికోలస్ పూరన్.. కీరన్ పొలార్డ్ నుంచి వెస్టిండీస్ పరిమితో ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్నాడు. నెదర్లాండ్స్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్ గెలిచాడు. అయితే, పాకిస్తాన్ టూర్‌లో ఘోర పరాభవం ఎదురైంది. వన్డే సిరీస్‌లో పాక్ చేతిలో పూరన్ బృందం 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.
ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో బంగ్లా చేతిలో.. ఆ తర్వాత టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. మొదటి రెండు వన్డేల్లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment