West Indies vs India, 3rd ODI- తరూబా (ట్రినిడాడ్): ఎట్టకేలకు వెస్టిండీస్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ పవర్ ఆఖరి వన్డేలో బయటికొచ్చింది. సిరీస్ గెలుచుకొచ్చే ఆటతీరును కనబరిచింది. ఆతిథ్య ప్రత్యర్థి ముందు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. సీనియర్లు లేకపోయినా... ఇకపై టీమిండియాకు తురుపుముక్కలు కానున్న బ్యాటర్లు బాధ్యత పంచుకున్నారు.
మెరుపు అర్ధ శతకాలతో
ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సంజూ సామ్సన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులతో అర్ధ సెంచరీలు సాధించి రాణించారు.
ఈ సిరీస్‌లో తమని వణికించిన కరీబియన్ బౌలింగ్‌పై ఈ మ్యాచ్‌లో ఓ ఆటాడుకున్నారు. దీంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీస్కోరు చేసింది. విండీస్‌లో వెస్టిండీస్ జట్టుపై భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్న విండీస్ గత మ్యాచ్‌లాగే భారత్‌ను కట్టడి చేయాలనుకున్న ఆశలకు ఓపెనింగ్ జోడీ నుంచే నిరాశ ఎదురైంది. దాదాపు 20 ఓవర్ల (19.4) పాటు గిల్, ఇషాన్‌లే ఆడేశారు. విండీస్ బౌలర్లను బాదేశారు. యథేచ్ఛగా పరుగులు సాధించారు. దీంతో తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక్కడే
ఇషాన్ అవుటయ్యాక
వచి్చన రుతురాజ్ గైక్వాడ్ (8) తక్కువే చేశాడు. అయితే గిల్‌కు సామ్సన్ జతవ్వడంతో మళ్లీ పరుగులు.... విండీస్‌కు కష్టాలు... కొనసాగాయి. భారీ సిక్సర్లతో వేగంగా (39 బంతుల్లో) అర్ధసెంచరీ చేసిన సంజూ, సెంచరీపై కన్నేసిన గిల్ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించారు. అప్పుడు భారత్ స్కోరు 244/3.
పాండ్యా సైతం
ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో బలమైన భాగస్వామ్యం నమోదు చేయడంతో 45.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 300 దాటింది. సూర్య అవుటైనా... 45 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న పాండ్యా చుక్కలు చూపించే సిక్సర్లతో స్కోరు వేగాన్ని అమాంతం పెంచాడు. షెఫర్డ్ 2 వికెట్లు తీశాడు.
ఇక కీలకమైన ఈ మ్యాచ్‌కూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లిలకు విశ్రాంతిని కొనసాగించారు. అయితే తుదిజట్టులో ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ స్థానాల్లో రుతురాజ్, ఉనాద్కట్‌లను తీసుకున్నారు.
చిత్తుగా ఓడించి.. చరిత్ర సృష్టించి
కాగా 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తద్వారా వరుసగా విండీస్‌పై 13 వన్డే సిరీస్‌లు(2007- 2023 మధ్య) గెలిచి చరిత్ర సృష్టించింది.
Mukesh Kumar is in a hurry to finish things off! Can he convert it into a fifer?#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/wWPNTY853m
— FanCode (@FanCode) August 1, 2023
ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డులకెక్కింది. జింబాబ్వే(1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్‌లు గెలిచిన పాకిస్తాన్.. టీమిండియాను ఫాలో అవుతోంది.
ఇక పదేసి విజయాలతో టీమిండియా శ్రీలంక(2007-23)పై.. పాకిస్తాన్ వెస్టిండీస్ (1999-22) ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: ఏపీఎల్ సీజన్ 2 వేలంలో విశాఖ క్రికెటర్‌కు రికార్డు ధర
From 1-1 to 2-1! 👏 🏆
— BCCI (@BCCI) August 2, 2023
The smiles say it all! ☺️ ☺️ #TeamIndia | #WIvIND pic.twitter.com/M3oQLNUOg0
Comments
Please login to add a commentAdd a comment