Ind Vs WI: Fans Praises Sanju Samson For Saving Crucial Boundary Final Over - Sakshi
Sakshi News home page

Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్‌!

Published Sat, Jul 23 2022 12:09 PM | Last Updated on Sat, Jul 23 2022 1:33 PM

Ind Vs WI: Fans Praises Sanju Samson For Saving Crucial Boundary Final Over - Sakshi

Ind vs WI 1st ODI- Terrific Effort From Sanju Samson: అకీల్‌ హొసేన్‌ (32 బంతుల్లో 32 పరుగులు- నాటౌట్‌).. రొమారియో షెఫర్డ్‌(25 బంతుల్లో 39 పరుగులు- నాటౌట్‌).. ఈ వెస్టిండీస్‌ బౌలర్లు ఇద్దరు.. తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించారు. సునాయాసంగానే గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌.. ఆఖరి బంతి వరకు తీసుకువచ్చారు.

వీరి అద్భుత పోరాటం విండీస్‌ అభిమానులకు ముచ్చటగొలుపగా.. టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ చివరి ఓవర్‌లో రాణించిన విధానం భారత ఫ్యాన్స్‌ను మురిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం మొదటి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్‌ గెలిచిన విండీస్‌ ధావన్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. 309 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

సంజూ చేసెను అద్భుతం!
టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నికోలస్‌ పూరన్‌ బృందం శాయశక్తులు ఒడ్డింది. ముఖ్యంగా.. బౌలర్లు అకీల్‌ హొసేన్‌, రొమారియో షెఫర్డ్‌ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. చివరి ఓవర్లో విండీస్‌ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు.

మొదటి బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. రెండో బంతికి లెగ్‌బై రూపంలో ఒక రన్‌ వచ్చింది. మూడో బాల్‌ను షెఫర్డ్‌ బౌండరీకి తరలించాడు. దీంతో విండీస్‌ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఇక నాలుగో బంతికి షెఫర్డ్‌ రెండు పరుగులు రాబట్టాడు. ఐదో బంతి వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ సంజూ అద్భుతంగా డైవ్‌ చేసి బంతిని ఆపకపోతే బౌండరీని తాకేదే!

ఇక తర్వాతి రెండు బంతుల్లో విండీస్‌కు వరుసగా రెండు, ఒక పరుగు మాత్రమే రావడంతో భారత్‌ విజయం ఖరారైంది. మూడు పరుగుల తేడాతో ధావన్‌ సేన గెలుపొందింది. ఈ క్రమంలో కీలక సమయంలో వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్న సంజూ శాంసన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘సంజూ గనుక డైవ్‌ చేసి ఆ బంతిని ఆపకపోయి ఉంటే ఏమయ్యేదో? ఆ బాల్‌ బౌండరీని తాకితే టీమిండియా కథ అప్పుడే ముగిసేది. ధావన్‌, గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌తో పాటు ఆఖరి ఓవర్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న సంజూ కూడా ప్రశంసలకు అర్హుడే అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement