విండీస్‌పై టీమిండియా విజయంలో కుల్దీప్ కీలక పాత్ర
West Indies vs India, 1st ODI: ‘‘గతంలో చాలా సార్లు నాకిలా జరిగింది. పరిస్థితులు, జట్టు కూర్పునకు అనుగుణంగా మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకునే క్రమంలో నాకు ఆడే అవకాశం రాలేదు. జట్టులోకి రావడం, వెళ్లడం.. ఇప్పుడిదంతా సర్వసాధారణమైపోయింది. ఎన్నో ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. దాదాపు ఆరేళ్లకు పైనే అయింది.
ఇవన్నీ అత్యంత సాధారణ విషయాలు’’ అని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ చైనామన్ స్పిన్నర్ టీమిండియాకు ఎంపికవుతున్నా అప్పుడప్పుడు మాత్రమే తుదిజట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నాడు.
టెస్టు క్రికెట్‌లో కాస్త వెనుకబడ్డాడు!
ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన, రవీంద్ర జడేజాలు పాతుకుపోగా.. వీరితో పాటు ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ కూడా దూసుకుపోతున్నాడు. దీంతో గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు.
సంచలన స్పెల్‌తో మెరిసి
బార్బడోస్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కుల్దీప్ యాదవ్‌కు జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం గురించి ప్రశ్న ఎదురుకాగా పైవిధంగా స్పందించాడు. ఇక ఇప్పుడు కూడా తన దృష్టి కేవలం వికెట్లు తీయడంపై ఉండదని.. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో పొదుపుగా బౌలింగ్ చేయడమే ముఖ్యమని భావిస్తానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment