సూర్యకుమార్ యాదవ్‌తో తిలక్ వర్మ (PC: IPL/BCCI)
India Vs West Indies T20 Series- Tilak Varma: ‘‘మీరన్నట్లు టీమిండియాకు ఎంపిక కావడం ఆషామాషీ విషయం కాదు. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే ఆసక్తి . పదకొండేళ్ల వయసులో నా దగ్గరికి వచ్చి నాన్న క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. మనం మిడిల్‌క్లాస్ కదా ఎట్లరా మరి అనుకున్నాం.
సరేలే చూద్దాం అని చెప్పా. అయితే, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను. తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మాకు లీగల్ అకాడమీ దగ్గరగా ఉండేది. అందుకే సలాం భయాశ్ దగ్గర శిక్షణకు వెళ్లాడు. అలా ముందుడుగు పడింది.
అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అండర్-14 కెప్టెన్ కూడా అయ్యాడు. చెన్నైలో ఆడాడు. అప్పటి నుంచి మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అండర్-16లో జూనియర్స్‌లో తిలక్‌కు అవకాశం వచ్చింది. నిజానికి మా దగ్గర బ్యాట్స్ కొనలేని పరిస్థితి ఉండేది.
కోచ్ అండతోనే
అలాంటపుడు కోచ్ అండగా నిలిచారు. టాలెంట్ ఉంది కదా నేను చూసుకుంటాను అని చెప్పారు. మనం కూడా కష్టపడాలి అని ఫిక్స్ అయ్యాం. అలా అలా.. ఎదుగుతూ వచ్చాడు. ఇక అండర్-19 వరల్డ్‌కప్ టీమ్‌కు సెలక్ట్ కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది.
ఆ తర్వాత ఏడాది గ్యాప్‌లో ఐపీఎల్. వేలం జరుగుతున్నపుడు మేమంతా ఇంట్లో ఉన్నాం. తిలక్ రంజీ ఆడేందుకు వెళ్లాడు. మావాడు బేస్‌ప్రైస్ 20 లక్షలు పెట్టాడు. హైదరాబాద్ వాళ్లు రేటు పెంచారు. ఆ తర్వాత చెన్నై కూడా వచ్చింది. రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీ పడింది. తర్వాత ముంబై ఇండియన్స్ ఎంట్రీ ఇచ్చింది.
మాకు నోట మాట రాలేదు.. కళ్లెమ్మట నీళ్లు
అప్పటికి 50 లక్షలు అంటేనే మేము ఆశ్చర్యంలో మునిగిపోయాం. గూస్‌బంప్స్ వచ్చేశాయి. తర్వాత చెన్నై వాళ్లు 70 అన్నారు. మాకు నోట మాట రాలేదు. అలా కోటి దాకా వెళ్లింది. పెరుగుతూనే ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్లెంట నీళ్లు వచ్చాయి.
ముంబై వాళ్లు ఏకంగా 1.7 కోట్లు అన్నారు. మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి’’ అంటూ హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుమారుడు టీమిండియాకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
వరల్డ్‌కప్ టోర్నీలో రాణించి
కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. వరల్డ్‌కప్‌లోనూ రాణించి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్-2022 వేలంలో జట్లన్నీ అతడి కోసం పోటీ పడగా.. ముంబై ఇండియన్స్ రూ. 1.7 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది.
రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఈ మేర ఖర్చుపెట్టడం అందరినీ విస్మయపరిచింది. అయితే.. ఫ్రాంఛైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఈ యువ బ్యాటర్. తన అరంగేట్రం సీజన్‌లోనే 14 మ్యాచ్‌లు ఆడి 397 పరుగులతో పైసా వసూల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక
ఇక ఐపీఎల్-2023లో 11 ఇన్నింగ్స్ ఆడి 343 పరుగులు సాధించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు గానీ.. లేదంటే అతడి ఖాతాలో మరిన్ని పరుగులు చేరేవే!! ఈ క్రమంలో తిలక్ వర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానమిచ్చారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ తిలక్ తల్లిదండ్రులను పలకరించగా.. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. సాధారణ ఎలక్ట్రిషియన్ కుటుంబంలో జన్మించిన తిలక్ వర్మ ఈ స్థాయికి ఎదగడంలో గల కష్టం గురించి చెప్పుకొచ్చారు.
చదవండి: Ind Vs Pak: సూర్యకుమార్‌కు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలిక ఎందుకు: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment