Australia Beats India By 9 Wickets: ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన మిథాలీ బృందం... ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ (107 బంతుల్లో 63; 3 ఫోర్లు) వరుసగా ఐదో అర్ధ సెంచరీ సాధించింది. యస్తిక భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), రిచా ఘోష్ (29 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
18 ఏళ్ల ఆసీస్ యువ పేసర్ డార్సీ బ్రౌన్ 4 వికెట్లు తీసింది. తద్వారా వన్డేల్లో నాలుగు వికెట్లు తీసిన అతి పిన్న ఆస్ట్రేలియా బౌలర్‌గా బ్రౌన్ ఘనతకెక్కింది. ఛేదనలో ఆస్ట్రేలియా 41 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 227 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు రాచెల్ హేన్స్ (100 బంతుల్లో 93 నాటౌట్; 7 ఫోర్లు), అలెస్సా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి హేన్స్ జట్టుకు విజయాన్ని అందించింది. ఆసీస్ మహిళల టీమ్‌కు వన్డేల్లో ఇది వరుసగా 25వ విజయం కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా బ్రౌన్ నిలిచింది. రెండో వన్డే 24న ఇదే వేదికగా జరగనుంది.
‘టాప్’లోనే మిథాలీ
మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మిథాలీ రాజ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 762 ర్యాంకింగ్ పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. స్మృతి మంధాన (7వ స్థానం) ర్యాంక్‌లో ఎటుంటి మార్పు లేదు. బౌలింగ్ విభాగంలో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఒక స్థానం మెరుగు పర్చుకుని నాలు గో స్థానంలో నిలిచింది. పూనమ్ యాదవ్ (భారత్) 9వ స్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక స్థానం పైకి ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది.
చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. గేల్ తర్వాతి స్థానంలో
Comments
Please login to add a commentAdd a comment