
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య రెండో టి20
ఆధిక్యంపై కన్నేసిన హర్మన్ బృందం
రాత్రి 11 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం
బ్రిస్టల్: ఇంగ్లండ్ పర్యటనలో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు ఇదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం జరిగే రెండో టి20లోనూ గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుస విజయాలతో పట్టుబిగించాలని ఆశిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఎదురైన ఘోరపరాజయం నుంచి తేరుకొని తదుపరి మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలని ఆతిథ్య ఇంగ్లండ్ యోచిస్తోంది మళ్లీ ఓడితే తీవ్రమైన ఒత్తిడిలోకి కూరుకుపోయే ప్రమాదం తప్పదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
స్మృతి తెచ్చిన ఆత్మవిశ్వాసంతో
రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్ సమస్యలతో అందుబాటులో లేకపోవడంతో జట్టును నడిపించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. అంతర్జాతీయ టి20లో తొలి శతకాన్ని బాదిన ఆమె అదే ఫామ్‌ను కొనసాగించాలనుకుంటోంది. షఫాలీ వర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హర్లీన్ డియోల్ మెరుపులు భారత స్కోరును 200 పైచిలుకు దాటించాయి. మొత్తానికి టాపార్డర్ బ్యాటర్లు మరోమారు బ్యాట్ ఝుళిపిస్తే భారీస్కోరు సాధ్యమవుతుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన రిచా ఘోష్, జెమీమాలు కూడా జతకలిస్తే స్కోరు వేగానికి అడ్డుఅదుపూ ఉండదు. కెపె్టన్ హర్మన్ తుదిజట్టుకు ఆడితే స్పిన్నర్ రాధా యాదవ్ బెంచ్‌కు పరిమితం అవుతుంది. స్పీడ్‌స్టర్ రేణుక లేకపోయినా... అమన్‌జోత్, దీప్తి శర్మ, శ్రీచరణి, స్నేహ్ రాణాలతో కూడిన బౌలింగ్ దళం గత మ్యాచ్‌లో సమష్టిగా ప్రభావం చూపించింది. వీళ్ల ప్రదర్శన కొనసాగితే భారత ఆల్‌రౌండ్ జోరుకు ఎదురుండకపోవచ్చు.
బ్యాటింగ్‌పై దృష్టి
ఆతిథ్య జట్టు బ్యాటర్లు గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. మొత్తం 11 మంది బ్యాటింగ్‌కు దిగితే వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సీవర్ బ్రంట్ మాత్రమే అర్ధసెంచరీతో అదరగొట్టింది. మిగతా బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. మొదట బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు కలిసికట్టుగా విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ ప్రధానంగా బ్యాటింగ్ విభాగంపై దృష్టిసారించింది. ఎందుకంటే కెపె్టన్ బ్రంట్ మినహా ఇక ఏ ఒక్కరు కూడా కనీసం 15 పరుగులైనా చేయలేకపోవడం జట్టును మరింత ఆందోళన పరిచింది. బ్యాటర్లు బాధ్యతగా కనబరిస్తేనే జట్టు గాడినపడుతుందని మేనేజ్‌మెంట్ ఆశిస్తుంది. లేదంటే సొంతగడ్డపై మరో భంగపాటు ఖాయమవుతుంది. ఇదేజరిగితే సిరీస్‌లో ఇంగ్లండ్ 0–2తో వెనుకబడిపోతుంది.