
2007 టి20 ప్రపంచకప్ హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని జోగిందర్ శర్మ తన ట్విటర్‌లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు. ''అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ జర్నీలో ఎన్నో ఏడాదులు అద్బుతంగా గడిచాయి. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఆరోజు ధోని నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం.. ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడం ఎప్పటికి మరిచిపోను. ఇక దేశవాలీ క్రికెట్‌లో నాకు సహకరించిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్‌లోనే కొనసాగాలనుకుంటున్నా. భిన్నమైన వాతావరణంలో నన్ను నేను సవాలు చేసుకుంటూ ముందుకు కొనసాగుతా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో ఇది తదుపరి దశ అనుకుంటున్నా.. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023
హర్యానాలోని రోహ్‌తక్ నుంచి వచ్చిన జోగిందర్ శర్మ 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో నాలుగు వన్డేలు, నాలుగు టి20లు ఆడిన జోగిందర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జోగిందర్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. .
ఒక్క ఓవర్‌తో హీరో అయ్యాడు..
జోగిందర్ శర్మ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది 2007 టి20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహించిన తొలి ఎడిషన్ ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. ధోని నేతృత్వంలోని యువ రక్తంతో కూడిన జట్టు అంచనాలకు మించి రాణించి విజేతగా నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ జరగడం హైలైట్ అనుకుంటే.. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ సాగడం మరో హైలైట్.
ఇక చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే పాక్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ క్రీజులో పాతుకుపోయాడు. ఎవరు ఊహించని విధంగా ధోని బంతిని జోగిందర్ శర్మ చేతికి ఇచ్చాడు. ఏమాత్రం అనుభవం లేని బౌలర్‌కు ఆఖరి ఓవర్‌ను ఇవ్వడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ధోని జోగిందర్‌ను నమ్మాడు.
తనపై ఉంచిన నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో జోగిందర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఆ ఒత్తిడిలోనే జోగిందర్ బంతి వేయగా.. మిస్బా స్కూప్ షాట్ ఆడడం.. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో పాక్ కథ ముగిసింది. అలా టీమిండియా 2007లో నిర్వహించిన తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా అవతరించింది.
చదవండి: Ian Botham: 'భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది'
నాలుగురన్నరేళ్లు దాటింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు