స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్‌తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..
- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).
- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).
- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.
టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్
ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్‌లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి.
ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్‌కు ఇది భారీ పరాజయం.
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment