ఐపీఎల్ ఆటగాళ్ల మెగావేలంలో అ‘ధర’గొట్టిన ఇషాన్ కిషన్... ఇప్పుడు మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ రోహిత్ అండతో ఓపెనింగ్‌లో శివతాండవం చేశాడు. మైదానం నలుమూలలా తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించాడు. హిట్‌మ్యాన్ రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా లంక బౌలర్లకు చుక్కులు చూపించడంతో ప్రత్యర్థి ఆటగాళ్లకు 20 ఓవర్లు కష్టాలే తప్ప ఊరటే దక్కలేదు.
లక్నో: కరీబియన్‌పై వరుస క్లీన్‌స్వీప్‌లు చేసి జోరుమీదున్న భారత్... లంకనూ చిత్తు చేసింది. తొలి టి20లో రోహిత్ సేన 62 పరుగులతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 1 సిక్స్) లంక బౌలర్లను దంచేశారు.
తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. వెస్టిండీస్‌తో ఆఖరి మ్యాచ్ ఆడిన జట్టులో ఆరు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ఇది వరకే రెండు వన్డేలాడిన దీపక్ హుడా ఈ మ్యాచ్‌తో టి20ల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇన్నాళ్లు రెస్ట్‌లో ఉన్న బుమ్రా, గాయం నుంచి కోలుకున్న జడేజా మైదానంలోకి దిగారు. చహల్, భువనేశ్వర్‌లు తుది జట్టుకు ఆడారు. రుతురాజ్ మణికట్టు గాయంతో ఆఖరి నిమిషంలో దూరమవగా సామ్సన్‌కు అవకాశం దక్కింది.
దంచేసిన రోహిత్, శ్రేయస్
టాస్ నెగ్గిన లంక మంచు ప్రభావం ఉంటుదని ఫీల్డింగ్ వైపు మొగ్గింది. దీంతో భారత్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. హిట్‌మ్యాన్ రెండో ఓవర్‌లో కొట్టిన బౌండరీతో ఆటలో వేగం పెరిగింది. తర్వాత అదేపనిగా కిషన్ రెచ్చిపోవడంతో పవర్ ప్లే (6 ఓవర్లు)లో 58/0 స్కోరు చేసిన భారత్ తొలి 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఇషాన్ దూకుడుతో వెనుకబడిన రోహిత్ ఇన్నింగ్స్ ధాటిగానే సాగింది. 11వ ఓవర్లోనే జట్టు స్కోరు మూడంకెలు (100) దాటింది.
లంకేయుల పాలిట సింహస్వప్పమైన ఈ ఓపెనింగ్ జోడీకి లహిరు కుమార ముగింపు పలికాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసి 111 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ జతయ్యాడు. ఈ జోడీ కూడా లంక బౌలింగ్‌ను తుత్తునియలు చేసింది. 17వ ఓవర్లో ఇషాన్ ఔటయ్యాడు. అప్పటికి శ్రేయస్ చేసింది 17 పరుగులే. కానీ 19, 20 ఓవర్లలో శ్రేయస్ చెలరేగాడు. సిక్స్‌లు, ఫోర్లతో ఈ రెండు ఓవర్లలోనే 32 పరుగులు సాధించాడు. అలా 25 బంతుల్లోనే (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ సాధించాడు. దీంతో 199 పరుగులు చేసి భారత్ సరిగ్గా 200 లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.
భువీ ధాటికి లంక విలవిల
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకను ఆదిలోనే సీమర్ భువనేశ్వర్ చావుదెబ్బ తీశాడు. ఓపెనర్లు నిసాంక (0), మిశార (13)లను ఔట్ చేశాడు. తర్వాత వెంకటేశ్ అయ్యర్, జడేజా, చహల్ తలా ఒక చేయి వేయడంతో 60 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. చరిత్ అసలంక... కరుణరత్నే (21), చమీర (24 నాటౌట్)లతో కలిసి కాసేపు ధాటిగా ఆడి అంతరాన్ని తగ్గించాడే కానీ కొండంత లక్ష్యం దిశగా తీసుకెళ్లలేకపోయాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) కుమార 44; ఇషాన్ (సి) లియనాగె (బి) షనక 89; శ్రేయస్ నాటౌట్ 57; జడేజా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–111, 2–155. బౌలింగ్: చమీర 4–0–42–0, కుమార 4–0–43–1, కరుణరత్నే 4–0–46–0, జయవిక్రమ 2–0–15–0, జెఫ్రీ వండెర్సే 4–0–34–0, షనక 2–0–19–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) భువనేశ్వర్ 0; మిశార (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 13; లియనాగె (సి) సామ్సన్ (బి) వెంకటేశ్ 11; అసలంక నాటౌట్ 53; చండిమల్ (స్టంప్డ్) ఇషాన్ (బి) జడేజా 10, షనక (సి) భువనేశ్వర్ (బి) చహల్ 3; కరుణరత్నే (సి) ఇషాన్ (బి) వెంకటేశ్ 21; చమీర నాటౌట్ 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–36, 4–51, 5–60, 6–97. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–9–2, బుమ్రా 3–0–19–0, హర్షల్ 2–0–10–0, చహల్ 3–0–11–1, వెంకటేశ్ అయ్యర్ 3–0–36–2, జడేజా 4–0–28–1, దీపక్ హుడా 3–0–24–0.
Comments
Please login to add a commentAdd a comment