
Team India New Coach Rahul Dravid Challenges: ‘ది వాల్’, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ముందుకు రాబోతున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఎంతో మంది యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్... ఇకపై టీమిండియాకు హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు.
భారత జట్టు ప్రధాన శిక్షకుడిగా రవిశాస్త్రి పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైనప్పటికీ.. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో కోహ్లి సేన కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఈ ఈవెంట్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ బాధ్యతలు చేపట్టనుండగా... భారత టీ20 జట్టు సారథిగా విరాట్ కోహ్లి స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోబోతున్నాడు.
ఈ మార్పుల నేపథ్యంలో వివాద రహితుడిగా పేరొందిన ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా ఎలా ముందుకు వెళ్లబోతున్నాడు? టీమిండియాను ఎలా సిద్ధం చేయబోతున్నాడు? ఐసీసీ టోర్నీల్లో గత కొంతకాలంగా రాణించలేకపోతున్న భారత్‌ను ముందుకు తీసువెళ్లేందుకు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నాడు? సీనియర్లు, యువ ఆటగాళ్లను ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగబోతున్నాడు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌తో హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ ప్రస్థానం మొదలుకాబోతుంది.
చదవండి: Ravi Shastri: రవిశాస్త్రి భావోద్వేగం.. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడి రికార్డులు ఇవే!