వహ్వా.. చెపాక్‌ తలైవా! | India post 286, England needs 482 runs to win | Sakshi
Sakshi News home page

వహ్వా...చెపాక్‌ తలైవా!

Published Tue, Feb 16 2021 4:46 AM | Last Updated on Tue, Feb 16 2021 7:58 AM

India post 286, England needs 482 runs to win - Sakshi

అశ్విన్‌ సెంచరీ సందర్భంగా పెవిలియన్‌లో లేచి నిలబడి చప్పట్లతో అభినందిస్తున్న జట్టు సహచరులు

‘నేను చెప్పింది ఎలాగూ చేస్తాను... కానీ నేను చెప్పనిది కూడా చేస్తాను’... రజినీకాంత్‌ ‘అన్నామలై’ సినిమాలోని సూపర్‌హిట్‌ డైలాగ్‌ ఇది. రజినీకి వీరాభిమాని అయిన చెన్నై తలైవా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇదే మాట ఇంగ్లండ్‌ జట్టుకు చెప్పినట్లున్నాడు. తన బలమైన స్పిన్‌తో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ చెలరేగాడు. స్పిన్‌ పిచ్, బ్యాటింగ్‌కు కష్టమంటూ చెబుతున్నవన్నీ ఒట్టి మాటలే అంటూ రుజువు చేస్తూ అశ్విన్‌ అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు నివ్వెరపోయింది. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తెచ్చేశాడు. అసాధ్యమైన 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మరో రెండు రోజులు ఎలాంటి వాన, తుఫాన్‌లు కూడా రక్షించే పరిస్థితి లేదు. అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్‌ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్‌ 1–1తో సమం కావడం ఇక లాంఛనమే. 
 
చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్‌ విజయం దిశగా సాగుతోంది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. లారెన్స్‌ (19 బ్యాటింగ్‌), రూట్‌ (2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 54/1తో ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు.

సూపర్‌ ఫోక్స్‌...
మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సెషన్‌లో భారత్‌ ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. సోమవారమే తన 28వ పుట్టిన రోజు జరుపుకున్న వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ ఇందులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే చతేశ్వర్‌ పుజారా (7) దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అలీ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడగా బంతి షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌ పోప్‌ వద్దకు వెళ్లింది. అతని త్రోను అందుకొని ఫోక్స్‌ స్టంప్స్‌ను పడగొట్టాడు. పుజారా సరైన సమయంలోనే వెనుదిరిగినా అతని బ్యాట్‌ పిచ్‌లో ఇరుక్కుపోవడంతో రనౌట్‌ తప్పలేదు. అదే స్కోరు వద్ద ఫోక్స్‌ అద్భుత స్టంపింగ్‌తో రోహిత్‌ శర్మ (26) అవుటయ్యాడు. కొద్ది సేపటికే లీచ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్‌ (8)ను కూడా ఫోక్స్‌ స్టంపౌట్‌ చేశాడు. రహానే (10) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అక్షర్‌ పటేల్‌ (7) వికెట్ల ముందు దొరికిపోయాడు. 1968 (అలెన్‌ నాట్‌) తర్వాత ఒక ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ టెస్టు మ్యాచ్‌లో మూడు స్టంపింగ్‌లు చేయడం (ఫోక్స్‌) ఇదే మొదటిసారి.  

కోహ్లి నిలకడ...
భారత్‌ స్కోరు 106/6గా నిలిచిన దశలో జట్టును ఆదుకునే బాధ్యత కోహ్లి తనపై వేసుకున్నాడు. అశ్విన్‌ సహకారంతో అతను ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ 20వ బంతికి గానీ తొలి పరుగు తీయని కెప్టెన్‌... నిలదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. లంచ్‌ తర్వాత మరింత ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన కోహ్లి 107 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి, అశ్విన్‌ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో అలీ ఈ జోడీని విడదీశాడు. అలీ బౌలింగ్‌లో విరాట్‌ ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అంపైర్‌ నిర్ణయంపై అతను రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కుల్దీప్‌ (3), ఇషాంత్‌ (7) తొందరగానే వెనుదిరిగినా అశ్విన్‌కు సిరాజ్‌ (16 నాటౌట్‌) అండగా నిలిచాడు. చివర్లో సిరాజ్‌ రెండు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. అశ్విన్‌ సెంచరీ తర్వాత కూడా భారత జట్టు డిక్లేర్‌ చేయకుండా ఆలౌట్‌ అయ్యే వరకు ఆటను కొనసాగించింది.  

రోహిత్‌ స్టంపౌట్‌

అదే తడబాటు...
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కాస్త పట్టుదల కనబర్చలేకపోయారు. అక్షర్‌ బంతిని ఆడలేక సిబ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోగా, దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన రోరీ బర్న్స్‌ (25) ఆటను అశ్విన్‌ ముగించాడు. నైట్‌ వాచ్‌మన్‌ లీచ్‌ (0) తొలి బంతికే వెనుదిరగడంతో రూట్‌ బరిలోకి దిగక తప్పలేదు. ఆ తర్వాత రూట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయం కోహ్లి ఆగ్రహానికి కారణమైంది.

కోహ్లికి కోపమొచ్చింది...
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రూట్‌ అవుట్‌ కోసం భారత్‌ చేసిన అప్పీల్‌ఫలితం ప్రతికూలంగా రావడం విరాట్‌ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. అక్షర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ పట్టిన పంత్‌ అప్పీల్‌ చేయగా, అంపైర్‌ నితిన్‌ మీనన్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో భారత్‌ రివ్యూ కోరింది. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని స్పష్టం కావడంతో ఎల్బీడబ్ల్యూ కోసం కూడా థర్డ్‌ అంపైర్‌ చెక్‌ చేశాడు. వికెట్ల ముందే రూట్‌ ప్యాడ్‌కు బంతి తగిలినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా... బాల్‌ ట్రాకర్‌ ప్రకారం ‘అంపైర్‌ కాల్‌’ అంటూ థర్డ్‌ అంపైర్‌ ప్రకటించడంతో రూట్‌ బతికిపోయాడు. దీనిపై కోహ్లి అంపైర్‌తో వాదనకు దిగగా, మైదానం బయట నుంచి హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు.

స్కోరు వివరాలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 329; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 134; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 26; గిల్‌ (ఎల్బీ) (బి) లీచ్‌ 14; పుజారా (రనౌట్‌) 7; కోహ్లి (ఎల్బీ) (బి) అలీ 62; పంత్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 8; రహానే (సి) పోప్‌ (బి) అలీ 10; అక్షర్‌ (ఎల్బీ) (బి) అలీ 7; అశ్విన్‌ (బి) స్టోన్‌ 106; కుల్దీప్‌ (ఎల్బీ) (బి) అలీ 3; ఇషాంత్‌ (సి) స్టోన్‌ (బి) లీచ్‌ 7; సిరాజ్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (85.5 ఓవర్లలో ఆలౌట్‌) 286.  
వికెట్ల పతనం: 1–42, 2–55, 3–55, 4–65, 5–86, 6–106, 7–202, 8–210, 9–237, 10–286.
బౌలింగ్‌: స్టోన్‌ 6.5–1–21–1, లీచ్‌ 33–6–100–4, మొయిన్‌ అలీ 32–7–98–4, రూట్‌ 4–0–15–0, స్టువర్ట్‌ బ్రాడ్‌ 9–3–25–0, లారెన్స్‌ 1–0–7–0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 25; సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్‌ 3; లారెన్స్‌ (బ్యాటింగ్‌) 19; లీచ్‌ (సి) రోహిత్‌  (బి) అక్షర్‌ 0; రూట్‌ (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 53.  
వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 2–1–6–0, అక్షర్‌ పటేల్‌ 9–3–15–2, అశ్విన్‌ 8–1–28–1.

ఒక టెస్టులో ఐదు వికెట్లు తీయడంతోపాటు సెంచరీ సాధించడం అశ్విన్‌కు మూడోసారి. రెండుసార్లు ఈ ఫీట్‌ చేసిన సోబర్స్, ముస్తాక్‌ మొహమ్మద్, కలిస్, షకీబ్‌లను అశ్విన్‌ అధిగమించగా... ఇయాన్‌ బోథమ్‌ (5 సార్లు) మాత్రమే ముందున్నాడు. సెంచరీతో పాటు మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు బోథమ్, ఇమ్రాన్‌ ఖాన్, షకీబ్‌ మాత్రమే నమోదు చేయగా, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ మరో 4 వికెట్లు తీస్తే వారి సరసన చేరతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement