లండన్: ఇంగ్లండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసురుతున్న భారత్ ఇప్పుడు వన్డేలపై కన్నేసింది. ఈ సిరీస్‌ను కూడా టి20 తరహా దూకుడుతో చేజిక్కించుకోవాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు టి20 చివరి మ్యాచ్‌లో నెగ్గిన ఊపులో ఉన్న ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయం. మంగళవారం జరిగే తొలి వన్డేలో రెండు జట్ల లక్ష్యం శుభారంభమే! తద్వారా సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. మోర్గాన్ తర్వాత జట్టుకు నాయకుడైన జోస్ బట్లర్ తన తొలి సిరీస్‌ను ప్రత్యర్థికి అప్పగించాడు. కానీ వన్డే సిరీస్‌లో బెన్ స్టోక్స్, రూట్‌లాంటి అనుభవజ్ఞులు అందుబాటులోకి రావడంతో సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
ధావన్‌తో ఓపెనింగ్!
తదుపరి వెస్టిండీస్ పోరుకు సారథి అయిన శిఖర్ ధావన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. కోహ్లి ఫామ్‌పై తనకు ఎలాంటి బెంగ లేదని రోహిత్ తెలిపాడు. అయితే ఆఖరి టి20 సందర్భంగా కోహ్లికి గజ్జల్లో గాయం కావడంతో అతను తొలి వన్డేలో ఆడేది సందేహమే. చివరి టి20లో అద్భుత సెంచరీతో అలరించిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే జట్టులో చాన్స్ దక్కొచ్చు. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. హిట్టర్లు రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ జడేజాలతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఢోకా లేదు. బౌలింగ్‌లో బుమ్రాకు అనుభవజ్ఞుడైన షమీ జతకలవడం, ప్రసిధ్ కృష్ణ రావడం పేస్ విభాగాన్ని పటిష్టం చేసింది. మరోవైపు చహల్, జడేజా స్పిన్‌తో మ్యాజిక్ చేసేందుకు రెడీగా ఉన్నారు.
బదులు తీర్చుకునే పనిలో ఇంగ్లండ్
టి20 సిరీస్ చేజార్చుకున్న బట్లర్ జట్టు వన్డే సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని చూస్తోంది. టి20కి భిన్నమైన తాజా సిరీస్‌లో పరుగులు పారించే బెయిర్‌స్టో, రూట్, ఆల్‌రౌండ్ మెరుపులతో స్టోక్స్ అందుబాటులో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మూడు మ్యాచ్‌ల్లోనూ మెరిపించలేకపోయిన బట్లర్ ఇక్కడ మిడిలార్డర్‌లో సత్తా చాటనున్నాడు.
రెగ్యులర్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టోలతో పాటు టాపార్డర్‌లో ఫిల్ సాల్ట్ కూడా కీలక బ్యాటర్‌గా మారాడు. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ ఇద్దరూ ఫామ్‌లో ఉండగా... బౌలింగ్ దళం కాస్త మారింది. డేవిడ్ విల్లే, రీస్ టోప్లేలకు బ్రైడన్ కార్స్ జతయ్యాడు. ఆఖరి టి20లో గెలుపుతో క్లీన్‌స్వీప్‌ను తప్పించుకున్న ఇంగ్లండ్ ఇప్పుడు అదే ఉత్సాహంతో తొలి వన్డే నుంచే భారత్ ఓడించాలనే లక్ష్యంతో ఉంది.
పిచ్, వాతావరణం
ఇంగ్లండ్ పిచ్‌లన్నీ పేస్‌కు అనుకూలమైనవే! ‘ద ఓవల్’ మైదానం కూడా అంతే. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. వర్షం ముప్పు లేదు. చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు అవాంతరమైతే ఉండదు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, షమీ, ప్రసిధ్‌కృష్ణ, చహల్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, సాల్ట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, విల్లే, కార్స్, రీస్ టోప్లే, సామ్ కరన్.
Comments
Please login to add a commentAdd a comment