టీ20 వరల్డ్‌కప్ 2024 తుది అంకానికి చేరింది. భారత్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్స్ చేరాయి. రేపు (జూన్ 29) జరుగబోయే ఫైనల్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. బార్బడోస్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీమిండియాకు 13 ఏళ్ల కరువు
టీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి (వన్డే వరల్డ్‌కప్) ప్రపంచకప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.
టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్‌లో సాధించింది. ఆతర్వాత 2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌కు పొట్టి ప్రపంచకప్ గెలిచే అవకాశం వచ్చింది. రేపు జరుగబోయే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను చిత్తు చేసి 13 ఏళ్ల కరువు తీర్చుకోవాలని భావిస్తుంది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. 1992లో తొలి వరల్డ్‌కప్ (వన్డే) ఆడిన సఫారీలు.. ఆతర్వాత 8 వన్డే ప్రపంచకప్‌లు, 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడితే తొలిసారి (2024) ఫైనల్‌కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తమ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని సఫారీలు అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. వరల్డ్‌కప్ గెలవడం సౌతాఫ్రికన్ల చిరకాల కోరికగా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే, ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సౌతాఫ్రికా తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఆజేయ జట్టుగా కొనసాగతుంది.
మరోవైపు భారత్.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. భారత్ సైతం ఈ టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతుంది. అయితే సూపర్-8లో భారత్ ఆడాల్సిన ఓ మ్యాచ్ (కెనడా) వర్షం కారణంగా రద్దైంది.
Comments
Please login to add a commentAdd a comment