ముంబై: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న కోహ్లీ సేనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్‌లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి రీప్లేస్‌మెంట్‌గా మరో ఇద్దరు క్రికెటర్లను లండన్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు అక్కడ టీ20 సిరీస్ ముగియగానే కోహ్లీ సేనను జాయిన్ అవుతారని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ధవన్ సేనలో కొనసాగుతున్న షా, సూర్యకుమార్‌లకు బంపర్ ఆఫర్ లభించినట్లైంది.
🚨 NEWS 🚨: Injury & replacement updates - India’s Tour of England, 2021
— BCCI (@BCCI) July 26, 2021
More Details 👇 #ENGvIND
వీరిలో పృథ్వీ షా ఇదివరకే టెస్టుల్లో అరంగేట్రం చేయగా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడగా, ఇటీవల జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు గాయాలపాలయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరారు. దీంతో ప్రస్తుతం లంక పర్యటనలో సత్తా చాటుతున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌లకు లక్కీ ఛాన్స్ లభించింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే నెల 4న ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
కోహ్లీ సేన: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్‌వాలా
Comments
Please login to add a commentAdd a comment