![India Unselected XI for CT 2025: Check Squad Full Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/12344.jpg.webp?itok=KtaKt11F)
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.
గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.
అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..
ఓపెనర్లుగా ఆ ఇద్దరు
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్‌లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.
వికెట్ కీపర్‌గా ఇషాన్
మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.
శతకాల ధీరుడు లేకుంటే ఎలా?
ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్‌లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.
ఏదేమైనా మిడిలార్డర్‌లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్‌రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.
బౌలర్ల దళం
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.
పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.
ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.
బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.
చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment