రెండో టెస్ట్‌ : ముగిసిన తొలిరోజు ఆట | India Vs England 2021 Day 1 Highlights 2nd Test Telugu | Sakshi
Sakshi News home page

Ind Vs Eng Second Test Highlights: టీమిండియా స్కోరు 300/6

Published Sat, Feb 13 2021 9:09 AM | Last Updated on Sat, Feb 13 2021 5:14 PM

India Vs England 2021 Day 1 Highlights 2nd Test Telugu - Sakshi

సాక్షి, చెన్నై: ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటను ముగించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 88 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం పంత్‌ 33 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 5 పరుగుతో క్రీజులో ఉన్నారు. తొలి రెండు సెషన్లు ఇంగ్లండ్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టీమిండియా చివరి సెషన్‌లో మాత్రం కాస్త తడబడింది. లంచ్‌ విరామం తర్వాత టీ సెషన్‌ వరకు మరొక వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడిన భారత జట్టు చివరి సెషన్‌లో మాత్రం మూడు వికెట్లు చేజార్చుకుంది. టీమిండియా బ్యాటింగ్‌లో రోహిత్‌ 161 పరుగులు చేయగా.. రహానే 66 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లు జాక్‌ లీచ్‌, మొయిన్‌ అలీ తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఓలి, రూట్‌లు చెరొక వికెట్‌ తీశారు.

లైవ్‌ అప్‌డేట్స్‌:
తొలిరోజు ఆటలో భాగంగా చివరి సెషన్‌లో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఇప్పటికే రోహిత్‌, రహానే అవుట్‌ కాగా తాజాగా అశ్విన్‌ అవుటవడంతో టీమిండియా 284 పరుగుల వద్ద 6వ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పంత్‌ 28, అక్షర్‌ పటేల్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా 249 పరుగుల వద్ద 5వ వికెట్‌ను కోల్పోయింది. రోహిత్‌ అవుటైన మరుసటి ఓవర్‌లోనే మొయిన్‌ అలీ బౌలింగ్‌లో అజింక్య రహానే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రహానే 149 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులు సాధించాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 161 పరగులు(231 బంతులు, 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి అవుటయ్యాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 248 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. దీంతో రహానే, రోహిత్‌ల మధ్య ఏర్పడిన 161 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం రహానే 66 పరుగులు, పంత్‌ 0 పరగులతో క్రీజులో ఉన్నారు. 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అజింక్య రహానే అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 136 పరుగులతో ఆడుతున్నాడు.106 బంతుల్లో 8 ఫోర్లతో అర్థసెంచరీ సాధించిన రహానేకు ఇది టెస్టుల్లో 24వ హాఫ్‌ సెంచరీ

రెండో టెస్టులో టీ విరామ సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 132 పరుగులు, రహానే 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు రోహిత్‌, రహానే మధ్య 103 పరుగుల(196 బంతులు) భాగస్వామ్యం నమోదైంది. కాగా ఈ సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. లంచ్‌ విరామానికి ముందు కోహ్లి, పుజారా, గిల్‌ వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్‌, రహానేలు మరో వికెట్‌ పడకుండా ఆడుతూ సెషన్‌ను ముగించారు.


టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ శతకంతో మెరిసాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ తన టెస్టు కెరీర్‌లో 7వ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 42 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. రహానే 26 పరుగులతో రోహిత్‌కు మంచి సహాకారమందిస్తున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించిన టీమిండియా వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది. రోహిత్‌ 88 పరుగులు, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులతో లంచ్‌ విరామానికి వెళ్లింది. రోహిత్‌ 80, రహానే 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. మెయిన్‌ అలీ వేసిన 21వ ఓవర్‌ మూడో బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం తన కెరీర్‌లో ఇది‌ 11వ సారి కావడం విశేషం. అంతకముందు రోహిత్‌తో కలిసి నిలకడగా ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా 21 పరుగులు చేసి జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో​ అవుట్‌గా వెనుదిరిగాడు. 

 టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అర్థ సెంచరీ సాధించాడు. జాక్‌ లీచ్‌ వేసిన 14వ ఓవర్‌ ఐదో బంతిని ఫోర్‌ కొట్టిన రోహిత్‌ ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన రోహిత్‌ 47 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో కెరీర్‌లో 12వ అర్థ సెంచరీ సాధించాడు.

గిల్‌ డకౌట్‌ అయిన తర్వాత రోహిత్‌, పుజారాలు నిలకడగా ఆడుతూ టీమిండియా స్కోరును 14 ఓవర్‌లో 50 పరుగులు దాటించారు.

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్‌ శుభమన​ గిల్‌ ఎదుర్కొన్న మూడో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌, పుజారా ఉన్నారు.

టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. కోహ్లి సేన పలు మార్పులతో బరిలోకి దిగింది. ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకోగా.. స్టార్‌ పేసర్‌ బుమ్రాకు తుది జట్టులో చోటుదక్కలేదు. హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు‌ స్థానం లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులో‌ విజయం సాధించిన పర్యాటక జట్టు సిరీస్‌లో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇక టోర్నీపై పట్టు నిలుపుకోవాలి అంటే మెరుగైన ప్రదర్శనతో  కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి. తాజా టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అభిమానులను అనుమతిస్తున్నారు. కరోనా కాలం తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.


తుది జట్ల వివరాలు..
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్ యాదవ్‌‌.

ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, స్టోన్‌.

పిచ్, వాతావరణం
తొలి టెస్టుతో పోలిస్తే భిన్నమైన పిచ్‌. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్‌ మనగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్‌ మరోసారి కీలకం కానుంది.  మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement