బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఈ బజ్‌బాల్ స్టైల్ తో ప్రత్యర్థులను భయపెడుతోంది ఇంగ్లండ్ టీమ్. తమ చివరి 17 టెస్టుల్లో 12 మ్యాచ్ లను గెలిచింది. ఇదే బజ్‌బాల్‌తో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. అయితే ఆసీస్‌తో సిరీస్‌లో ఓటములు ఎదురైనా బజ్‌బాజ్ ఆటను ఆపబోయేది లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు.
యాషెస్ సిరీస్‌ను 2-2తో సమం చేసినప్పటికి స్లో ఓవర్ రేట్ కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీగా కోత పడింది. దీంతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్‌కు మళ్లీ టెస్టు సిరీస్‌లు లేవు. జనవరి-ఫిబ్రవరి నెలలో టీమిండియాకు రానున్న ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై కూడా బజ్‌బాల్ దూకుడును కంటిన్యూ చేస్తామని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్పేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు అసలు పరీక్ష భారత్‌లో ఎదురు కాబోతోందని అభిప్రాయపడ్డాడు. ఎక్కువగా స్పిన్ ట్రాక్‌లుండే భారత పిచ్‌లపై బజ్‌బాల్ స్టైల్ ఆలోచించడానికే కొంత ఆసక్తికరంగా ఉందన్నాడు.
నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.."బజ్‌బాల్ తర్వాతి పరీక్ష ఇండియాలోనే. భారత్ పిచ్‌ల గురించి అందరికీ తెలుసు. ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఆడడం ప్రత్యర్థి దేశాలకు కఠినంగా ఉంటుంది. స్పిన్ పిచ్‌లపై బజ్‌బాల్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చెప్పలేం.
అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న టీమిండియా బౌలింగ్‌తో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆడటం అంటే మాటలు కాదు. పరిస్థితి తారుమారు అయితే ఇంగ్లండ్ ఆడాల్సిన బజ్‌బాల్‌ను టీమిండియా ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు."అని పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరి 29 నుంచి హైదరాబాద్, వైజాగ్, రాంచీ, రాజ్‌కోట్, ధర్మశాల వేదికల్లో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి.
చదవండి: D Gukesh: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం
Comments
Please login to add a commentAdd a comment