బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగపెట్టిన ఇంగ్లండ్.. తొలి మ్యాచ్‌లో గెలుపొంది తామే టెస్టు క్రికెట్ రారాజులమని చెప్పకనే చెప్పింది. కానీ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది.
అదే ఇంగ్లండ్ చేసిన పెద్ద తప్పు. రెండో టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. వైజాగ్ టెస్టులో పర్యాటక జట్టును టీమిండియా చిత్తు చేసింది. విధ్వంసం సృష్టించే ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాట్‌లు మూగబోయాయి.
భారత పేస్ గుర్రం బుమ్రా దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు గజగజలాడారు. ప్రత్యర్ధి కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయిపోయాడు. అయితే తొలి రెండు టెస్టులు ఒక లెక్క.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఒక లెక్క.
రాజ్‌కోట్‌లో రారాజు..
ఇంగ్లండ్ జట్టుకు రాజ్‌కోట్ టెస్టు ఎప్పటికి గుర్తిండిపోతుంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. 550 పరుగుల పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
అస్సలు మనం చూస్తుంది ఇంగ్లండ్ జట్టునేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. భారత స్పిన్ వ్యూహంలో చిక్కుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ దాటికి ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఎక్కడో లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ వుడ్(33) మినహా.. ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడు కూడా భారత బౌలర్లకు ఎదురుతిరగలేదు.
గెలుపు విషయం పక్కన పెడితే కనీసం డ్రా అయినా చేసుకుందమన్న భావన ఏ ఒక్కరిలోనూ కన్పించలేదు. క్రీజులో కంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే బెటర్ అన్నట్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఎప్పుడో 1934లో టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా ఘోర ఓటమిని చూవిచూసిన ఇంగ్లండ్‌కు.. మళ్లీ ఇప్పుడు భారత్ పుణ్యాన ఘోర పరభావాన్ని చవిచూసింది.
కచ్చితంగా ఈ ఓటమిపై ఇంగ్లండ్ జట్టుతో పాటు మేనెజ్‌మెంట్ ఆత్మ పరిశీలిన చేసుకోవాలి. చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీలు, మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు క్రికెట్‌కు వైట్‌బాల్ క్రికెట్ తేడా ఉంటుందన్న విషయాన్ని ఇంగ్లండ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
బౌలింగ్‌లోనూ అదే కథ..
ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ ఎంతో బలమో.. బౌలింగ్ కూడా అంతే బలం. జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్ వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగం సైతం చేతులేత్తేసింది. ముఖ్యంగా వరల్డ్‌క్లాస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అయితే గల్లీ బౌలర్ కంటే దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లో దాదాపు 700 వికెట్లు పడగొట్టిన అండర్సన్‌ను 22 ఏళ్ల యువ ఆటగాడు జైశ్వాల్ ఊచకోత కోశాడు.
భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసిన అండర్సన్.. 6 ఏకానమితో 78 పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పాటు మరో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌ది కూడా అదే పరిస్థితి. వుడ్ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ వుడ్‌కు చుక్కలు చూపించాడు.
ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. అరంగేట్ర టెస్టులోనే తన స్పిన్ మాయాజాలంతో అకట్టుకున్న టామ్ హార్ట్‌లీ తర్వాతి మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల ముందు దాసోహం అయ్యాడు. అడపదడపా వికెట్లు పడగొట్టి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులో ఎందుకు ఉన్నాడో అర్దం కావడం లేదు.
తొలి టెస్టులో కాస్త పర్వాలేదన్పించిన అహ్మద్.. ఆఖరి రెండు టెస్టుల్లో మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు విషయం పక్కన పెడితే పరుగులు కట్టడి చేయడంలో కూడా అహ్మద్ విఫలమయ్యాడు. అయితే సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ లేని లోటు ఇంగ్లండ్ జట్టులో సృష్టంగా కన్పిస్తోంది. ఇక రాంఛీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ జట్టు ఏ మెరకు పుంజుకుంటుందో మరి చూడాలి.
దుబాయ్ ట్రిప్ కొంపముంచిందా?
కాగా మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు పది రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు రీ ఫ్రెష్‌మెంట్ పేరిట దుబాయ్‌కు పయనమైంది. ఇదే ఇంగ్లండ్ కొంపముంచిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ గ్యాప్‌లో భారత్‌లోనే ఉండి ప్రాక్టీస్ చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మూడో టెస్టుకు కేవలం ఒక్కరోజు ముందే రాజ్‌కోట్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు హడావుడిగా బరిలోకి దిగింది. కనీసం ప్రాక్టీస్ లేకుండానే ఆడిన ఇంగ్లండ్‌కు సరైన గుణపాఠం భారత్ చెప్పింది. ఇంతకుముందు ఏ పర్యటక జట్టు కూడా భారత్‌కు వచ్చి విశ్రాంతి పేరిట బయటకు వెళ్లింది లేదు. ఇంగ్లండ్ మాత్రం ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపింది.
Comments
Please login to add a commentAdd a comment