Ishan Kishan Gets Praise From Former Cricketers After Smashing Half-Century On T20I - Sakshi
Sakshi News home page

అప్పట్లో ఇలాగే జరిగింది.. జార్ఖండ్‌ నుంచి వచ్చి..

Published Mon, Mar 15 2021 11:16 AM | Last Updated on Mon, Mar 15 2021 12:19 PM

India vs England 2nd T20 Ishan Kishan Praised By Former Cricketers - Sakshi

ఎంఎస్‌ ధోని- ఇషాన్‌ కిషన్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతడి ప్రతిభను కొనియాడుతూ మాజీ దిగ్గజాలు సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.  టీమిండియా మాజీ కెప్టెన్‌ మిస్టర్‌ కూల్‌ ధోనితో పోలిక తెస్తూ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇషాన్‌ను ప్రశంసించాడు. ఈ మేరకు.. ‘‘జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఓ యువ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ తన సామర్థ్యమేమిటో నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది(ధోనిని ఉద్దేశించి). ఏమాత్రం బెదురు లేకుండా ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు ఎంతగానో నచ్చింది’’ అని ట్వీట్‌ చేశాడు. కాగా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ధోని స్వస్థలం జార్ఖండ్‌ అన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్‌ కిషన్‌ జార్ఖండ్‌కు ఆడుతున్నాడు. దాంతో ధోని-ఇషాన్‌లకు పోలిక తెచ్చాఉడ సెహ్వాగ్‌.

ఇక భారత మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ సైతం.. ‘‘అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏమాత్రం తడబడకుండా ఇషాన్‌ కిషన్‌ ఆడిన తీరు అద్భుతం. ఐపీఎల్‌లో ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లో తనను తాను ఆవిష్కరించుకున్నాడు!! అలాగే కెప్టెన్‌ కోహ్లి కూడా తనదైన క్లాసిక్‌ ఆటతో ఫాంలోకి వచ్చాడు’’ అని పేర్కొన్నాడు. టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ , మహ్మద్‌ కైఫ్‌, ఆర్పీ సింగ్‌ తదితరులు ఇషాన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

అయితే, ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకేల్‌ వాన్‌ మాత్రం.. ఇషాన్‌ను కొనియాడుతూనే మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘నేను ముందే చెప్పాను కదా.. టీమిండియా టీ20 జట్టు కంటే ముంబై ఇండియన్స్‌ బెటర్‌ అని. ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు’’ అని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(73), ఇషాన్‌ కిషన్‌ ( 56) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా రెండో టీ20లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.‌ ఏడు వికెట్ల తేడాతో మోర్గాన్‌ బృందంపై గెలుపొంది 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

చదవండి: చాలా మంది చేయలేనిది పంత్‌ చేసి చూపించాడు.. 
చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ గెలిపించిన కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement