ఉత్కంఠ పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ
తీవ్ర ఉత్కంఠత రేపిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ సాధించింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు కావాల్సిన తరుణంలో ఇంగ్లండ్ కేవలం 6 పరుగులు మాత్రమే సాధించటంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో ఆరంభం నుంచి తడబడ్డ ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగలు చేసింది. ఆఖర్లో సామ్ కర్రన్(83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగినా ప్రయోజనం లేకుండా పోయింది. టీమిండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.
కాగా, భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు ఏ ఒక్క ఫార్మాట్‌లోనూ ఆశించిన ఫలితాలు దక్కలేదు. 4 టెస్టుల సిరీస్‌లో టీమిండియా తొలి టెస్టు కోల్పోయినప్పటికీ.. అనూహ్యంగా పుంజుకొని 3-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోగా, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సైతం అదే తరహాలో తొలి మ్యాచ్‌ను కోల్పోయి 3-2తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. తాజాగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా నిర్ణయాత్మక మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు, 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో గంపెడు ఆశలతో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ జట్టు వట్టిచేతులతో వెనుదిరిగింది.
హార్ధిక్ సూపర్ త్రో.. మార్క్ వుడ్ రనౌట్
టీమిండియా వన్డే సిరీస్ విక్టరీకి కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉంది. నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో మార్క్ వుడ్(14) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ గెలుపుకు 6 బంతుల్లో 14 పరుగులు సాధించాల్సి ఉంది.
ఆఖర్లో దడ పుట్టిస్తున్న సామ్ కర్రన్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్(70 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో దడ పుట్టించాడు. శార్ధూల్ వేసిన 47వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో ఇంగ్లండ్ గెలుపుకు 18 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది.
కోహ్లి సూపర్బ్ క్యాచ్.. ఆదిల్ రషీద్ ఔట్
శార్ధూల్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అదిల్ రషీద్(22 బంతుల్లో 19; 2 ఫోర్లు) పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్(42 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్), మార్క్ వుడ్(1) క్రీజ్‌లో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 259/8.
హార్దిక్ అద్భుతమైన క్యాచ్.. మొయిన్ ఔట్
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండు వందల పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. మొయిన్ అలీ(29) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 31 ఓవర్ మూడో బంతికి మొయిన్ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. మిడాఫ్‌లో హార్దిక్ అద్భుతమైన డైవ్ కొట్టి క్యాచ్ అందుకోవడంతో మొయిన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇది భువీకి మూడో వికెట్.
శార్ధూల్‌కు మరో వికెట్..ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్
హార్డ్ హిట్టర్ డేవిడ్ మలాన్(50 బంతుల్లో 50; 6 ఫోర్లు)హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. శార్ధూల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సూపర్ క్యాచ్ అందుకోడంతో మలాన్ పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 26 ఓవర్ల తరువాత ఇంగ్లండ్ స్కోర్ 168/6. మొయిన్ అలీ(8), సామ్ కర్రన్(0) క్రీజ్‌లో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. లివింగ్‌స్టోన్(36) ఔట్
శార్ధూల్ ఠాకూర్ అద్భుతమైన రివర్స్ క్యాచ్ అందుకోవడంతో సెట్ బ్యాట్స్‌మెన్ లివింగ్‌స్టోన్(31 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాటపట్టాడు. 24 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. మలాన్(45 బంతుల్లో 45; 6 ఫోర్లు), మొయిన్ అలీ(1) క్రీజ్‌లో ఉన్నారు.
బట్లర్(15) ఔట్.. ఇంగ్లండ్ 98/4
16వ ఓవర్‌లో శార్ధూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(18 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లండ్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసే సరికి 98/4. మలాన్(26 బంతుల్లో 24), లివింగ్‌స్టోన్(3 బంతుల్లో 1) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. డేంజరస్ స్టోక్స్(35) అవుట్
రెండో వన్డేలో తరహాలో మళ్లీ విధ్వంసం సృష్టిస్తాడనుకున్న బెన్ స్టోక్స్(39 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్)ను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నటరాజన్ పెవిలియన్‌కు పంపాడు. 11 ఓవర్‌లో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ వెనుదిరిగాడు. 11 ఓవర్ల తరువాత ఇంగ్లండ్ స్కోర్ 68/3. జోస్ బట్లర్(0), మలాన్(12) క్రీజ్‌లో ఉన్నారు.
భువీ మాయ.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ మాయాజాలం చేశాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. తొలి ఓవర్లో జేసన్ రాయ్‌ని బౌల్డ్ చేసిన ఆయన.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బెయిర్ స్టో(4 బంతుల్లో 1)ను ఎల్బీడబ్యూ చేశాడు. 3 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 28/2. క్రీజ్‌లో స్టోక్స్(8 బంతుల్లో 10), డేవిడ్ మలాన్(0) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. జేసన్ రాయ్(14) క్లీన్ బౌల్డ్
టీమిండియాకు తొలి ఓవర్‌లోనే ఫలితం లభించింది. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్‌లో వరుస బౌండరీలు సాధించిన జేసన్ రాయ్(6 బంతుల్లో 14) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్ తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 14/1. క్రీజ్‌లో బెయిర్ స్టో(0), స్టోక్స్(0) ఉన్నారు.
టీమిండియా 329 ఆలౌట్
ఆఖర్లో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో.. టీమిండియా మరో పది బంతులు మిగిలుండగానే 329 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టు స్కోర్ 321 పరుగుల వద్ద ఉండగా, ఏడో వికెట్‌గా శార్ధూల్ వెనుదిరగగా, కేవలం 8 పరుగుల వ్యవధిలో భారత్ మిగిన మూడు వికెట్లు(328 వద్ద కృనాల్, 329 వద్ద భువీ, నటరాజన్) కోల్పోయి.. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, రషీద్ 2, సామ్ కర్రన్, టాప్లే, స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌లు తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ టార్గెట్ 330 పరుగులు.
ఆఖరి వికెట్ కోల్పోయిన భారత్
టాప్లే బౌలింగ్‌లో సామ్ కర్రన్ క్యాచ్ పట్టడంతో భువనేశ్వర్ కుమార్(5 బంతుల్లో 3) ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. 48.2 ఓవర్లలో టీమిండియా 329పరుగులకు ఆలౌటైంది.
మార్క్ వుడ్ మ్యాజిక్..
భారీ స్కోర్ సాధించాలనుకున్న టీమిండియా ఆశలకు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ గండి కొట్టాడు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బతీశాడు. 46 ఓవర్ ఆఖరి బంతికి శార్ధూల్‌ను ఔట్ చేసిన ఆయన.. మరుసటి ఓవర్‌లో(48 ఓవర్) కృనాల్(34 బంతుల్లో 25), ప్రసిద్ద్ కృష్ణ(0)లను ఔట్ చేశాడు. 48 ఓవర్ల తరువాత టీమిండియా స్కోర్ 329/9.
శార్ధూల్(30) ఔట్
క్రీజ్‌లోకి వచ్చీ రాగానే భారీ షాట్లతో అలరించిన శార్ధూల్ ఠాకూర్ 21 బంతుల్లో ఒక ఫోర్, మూడు భారీ సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 46 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 321/7. క్రీజ్‌లో కృనాల్(28 బంతుల్లో 20), భువనేశ్వర్(0) ఉన్నారు.
300 దాటిన టీమిండియా స్కోర్
ఓవైపు వికెట్లు పడుతున్నా టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఏమాత్రం జంకకుండా .. జట్టు స్కోర్‌ను 300 పరుగులు దాటించారు. దీంతో 44 ఓవర్ల తరువాత టీమిండియా స్కోర్ 308/6. క్రీజ్‌లో కృనాల్(23 బంతుల్లో 16), శార్ధూల్(15 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. హార్ధిక్(64) బౌల్డ్
స్టోక్స్ బౌలింగ్‌లో బౌండరీ బాది కసిగా కనిపించిన హార్ధిక్.. అ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదిన హార్ధిక్.. 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 39 ఓవర్ల తరువాత టీమిండియా స్కోర్ 276/6. క్రీజ్‌లో కృనాల్(5), శార్ధూల్ ఉన్నారు.
పంత్(78) అవుట్.. హార్ధిక్ ఫిఫ్టి
78 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషబ్ పంత్ అవుటయ్యాడు. 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాదిన ఆయన.. 78 పరుగులు చేసి సామ్ కర్రన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉండగా మరో ఎండ్‌లో ఉన్న హార్ధిక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 7వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 36.3 ఓవర్ల తరువాత టీమిండియా స్కోర్ 257/5. క్రీజ్‌లో హార్ధిక్, కృనాల్(0) ఉన్నారు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్
పంత్ విధ్వంసం వరుసగా మూడో వన్డేలోనూ కొనసాగింది. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న హార్ధిక్ పాండ్యా(20 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగటంతో 31 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/4.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్
స్వల్ప విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌కు మరోషాక్ తగిలింది. రెండో వన్డేలో అద్భుత శతకంతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌ను(18 బంతుల్లో 7) లివింగ్‌స్టోన్ బోల్తా కొట్టించాడు. రాహుల్.. ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 24.1 ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 156/4. పంత్‌కు(24 బంతుల్లో 30) తోడుగా హార్ధిక్ క్రీజ్‌లోని వచ్చాడు.
విరాట్ కోహ్లి బౌల్డ్
రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 10 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 18 ఓవర్ నాల్గో బంతికి కోహ్లి ఔటయ్యాడు. లోపలికి వచ్చిన బంతిని కట్ చేయబోయి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ఆ బంతి లెగ్ స్టంప్‌ను గిరాటేయడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరక తప్పలేదు. టీమిండియా 121 పరుగుల వద్ద ఉండగా కోహ్లి పెవిలియన్ చేరాడు.
స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔట్
ఆ తర్వాత రషీద్ వేసిన మరో ఓవర్‌లో ధవన్ సైతం పెవిలియన్ చేరాడు. ధవన్ 56 బంతుల్లో 10 ఫోర్లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ వేసిన 17 ఓవర్ నాల్గో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ధవన్ నిష్క్రమించాడు. దాంతో టీమిండియా 117 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
రోహిత్ శర్మ ఔట్
ఆరంభం నుంచి మంచి జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 37 బంతుల్లో 6 ఫోర్లతో దూకుడుగా ఉన్న సమయంలో రోహిత్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆదిలో రషీద్ వేసిన 15 ఓవర్ నాల్గో బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు.
ధావన్ అర్థశతకం.. టీమిండియా జోరు:
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో నాలుగో బంతిని బౌండరీగా మలిచిన ధావన్ వన్డే కెరీర్‌లో 32వ అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100పరుగులు చేసింది. ధావన్ 59, రోహిత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా శుభారంభం:
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మూడు వరుస ఫోర్లు కొట్టిన ధావన్ దూకుడు కనబరచడంతో టీమిండియా స్కోరును 50 పరుగులు దాటించాడు. ప్రస్తుతం టీమిండియా 9ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 22, ధావన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పుణే: భారత్‌లో ఇంగ్లండ్ సుధీర్ఘ పర్యటన ఈరోజుతో సమాప్తం కానుంది. టెస్టు, టి20 సిరీస్‌ల తర్వాత వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పుణే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా.. ఈ పోరుతో అంతిమ విజయం ఎవరిదో తేలనుంది. గత మ్యాచ్ అందించిన ఫలితంతో ఇంగ్లండ్ జట్టు ఉత్సాహంతో కనిపిస్తుంది. కాగా మ్యాచ్‌కు సంబంధించి ఇంగ్లండ్ జట్టు ఒక మార్పు చేసింది.టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయిన కుల్దీప్ యాదవ్ స్థానంలో టి. నటరాజన్ తుదిజట్టులోకి వచ్చాడు.
ఇక స్వదేశంలో వన్డేల్లో ఎంత స్కోరు చేస్తే భారత జట్టు సురక్షితంగా ఉండవచ్చు? ఇంగ్లండ్ లాంటి మేటి జట్టు ముందు 336 పరుగుల స్కోరు కూడా సరిపోదని రెండో వన్డేలోనే అర్థమైంది. బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా భారీ స్కోరు చేస్తే... ప్రపంచ చాంపియన్ జట్టు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడి దానిని అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండగకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గత మ్యాచ్ అనుభవంతో వ్యూహం మార్చి విజయాన్ని అందుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ఈ పర్యటనలో చివరి మ్యాచ్‌లో నెగ్గి ఒక్క ఫార్మాట్‌లోనైనా విజేతగా వెనుదిరగాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్,కృనాల్ పాండ్యా, శార్దుల్, టి.నటరాజన్, భువనేశ్వర్, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, ఆదిల్ రషీద్, టాప్లీ, వుడ్
Comments
Please login to add a commentAdd a comment