పదునైన పేస్ బౌలింగ్ ముందు భారత్ మరోసారి తలవంచింది. దాదాపు తొలి టి20 మ్యాచ్ తరహాలోనే సాగిన పోరులో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఓటమిని ఆహ్వానించింది. మార్క్ వుడ్ వేగం ముందు బ్యాట్స్‌మెన్ తలవంచగా... ఒక్క కోహ్లి మాత్రమే ఎదురుదాడితో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అయితే పసలేని బౌలింగ్‌తోపాటు పేలవ ఫీల్డింగ్‌తో మన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. బట్లర్ మెరుపులతో ఇంగ్లండ్ అలవోకగా లక్ష్యం చేరి సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అహ్మదాబాద్: ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది.
పవర్‌ప్లేలో 24/3...
భారత ఇన్నింగ్స్ రెండు పార్శ్వాలుగా సాగింది. తొలి 15 ఓవర్లలో కనీసం బంతికో పరుగు కూడా చేయలేకపోయిన జట్టు చివరి 5 ఓవర్లలో చెలరేగింది. ఆరంభంలో భారత్‌ను దెబ్బ తీయడంలో పేసర్ మార్క్ వుడ్ కీలకపాత్ర పోషించాడు. అతని తొలి ఓవర్లోనే రాహుల్ (0) క్లీన్‌బౌల్డ్ అయి మరోసారి నిరాశపర్చాడు. ఈ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌లలో వరుసగా 1, 0, 0 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ (15; 2 ఫోర్లు) కూడా వుడ్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ (4)ను జోర్డాన్ అవుట్ చేశాడు. దాంతో తొలి ఆరు ఓవర్లలో 24 పరుగులే చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పంత్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడినా... లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. కొద్ది సేపటికే అయ్యర్ (9; ఫోర్) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
కోహ్లి మెరుపులు...
15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 87 పరుగులే. అప్పటి వరకు తడబడుతూనే ఆడిన కోహ్లి కూడా 29 బంతుల్లో 28 పరుగులు (3 ఫోర్లు) చేశాడు. అయితే ఈ స్థితి నుంచి భారత కెప్టెన్ అద్భుత షాట్‌లతో విరుచుకుపడ్డాడు. ఆర్చర్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా మరో సిక్స్, ఫోర్ బాదాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. అప్పటి వరకు భారత్‌ను కట్టడి చేసిన వుడ్ ఓవర్లోనైతే కోహ్లి చెలరేగిపోయాడు. వరుస బంతుల్లో 6, 6, 4 సాధించాడు. వీటిలో ఆఫ్ సైడ్ వైపునకు జరిగి మిడ్ వికెట్ మీదుగా కొట్టిన తొలి సిక్సర్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. తాను ఎదుర్కొన్న చివరి 17 బంతుల్లో కోహ్లి 49 పరుగులు చేశాడు. ఆరో వికెట్‌కు హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 17; 2 సిక్స్‌లు)తో కలిసి కోహ్లి 70 పరుగులు జోడించాడు.
ఆడుతూ పాడుతూ...
ఛేదనలో ఇంగ్లండ్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. బట్లర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు వేగంగా సాగింది. చహల్ తొలి ఓవర్లో జేసన్ రాయ్ (13 బంతుల్లో 9; 2 ఫోర్లు) అవుటైనా...అదే ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో బట్లర్ తన జోరును మొదలు పెట్టాడు. శార్దుల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన బట్లర్ ... చహల్ మరుసటి ఓవర్లో కూడా 2 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 57 పరుగులకు చేరింది. 26 బంతుల్లోనే బట్లర్ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. డేవిడ్ మలాన్ (17 బంతుల్లో 18; సిక్స్)ను అవుట్ చేసి సుందర్ ఆశలు రేపినా... బట్లర్, బెయిర్‌స్టో కలిసి భారత్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. 62 బంతుల్లో 76 పరుగులు చేయాల్సిన ఈ దశలో వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. అటు బౌండరీలు, ఇటు సింగిల్స్ ద్వారా సమర్థంగా పరుగులు రాబట్టి జట్టును విజయతీరం చేర్చారు. 76 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి, 20 పరుగుల వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను చహల్ వదిలేసినా... అప్పటికే మ్యాచ్ దాదాపుగా చేజారడంతో వాటిని అందుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోయేది!
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 15; రాహుల్ (బి) వుడ్ 0; ఇషాన్ కిషన్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 4; కోహ్లి (నాటౌట్) 77; పంత్ (రనౌట్) 25; అయ్యర్ (సి) మలాన్ (బి) వుడ్ 9; పాండ్యా (సి) ఆర్చర్ (బి) జోర్డాన్ 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–7, 2–20, 3–24, 4–64, 5–86, 6–156. బౌలింగ్: రషీద్ 4–0–26–0; ఆర్చర్ 4–0–32–0; వుడ్ 4–0–31–3; జోర్డాన్ 4–1–35–2; స్టోక్స్ 2–0–12–0; స్యామ్ కరన్ 2–0–14–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) రోహిత్ (బి) చహల్ 9; బట్లర్ (నాటౌట్) 83; మలాన్ (స్టంప్డ్) పంత్ (బి) సుందర్ 18; బెయిర్‌స్టో (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1–23, 2–81. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–0; శార్దుల్ 3.2–0–36–0; చహల్ 4–0–41–1; హార్దిక్ 3–0–22–0; సుందర్ 4–0–26–1.
Comments
Please login to add a commentAdd a comment