నాలుగో టెస్టు: రెండో రోజు టీమిండియాదే.. | India Vs England 4th Test Day 2 Live Updates Telugu | Sakshi
Sakshi News home page

నాలుగో టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట.. 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

Published Fri, Mar 5 2021 9:50 AM | Last Updated on Fri, Mar 5 2021 5:06 PM

India Vs England 4th Test Day 2 Live Updates Telugu - Sakshi

టీమిండియా ,ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ‌ఇప్పటివరకు 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వాషింగ్టన్‌ సుందర్‌ 60 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండో రోజు ఆటలో టీమిండియా చివరి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ సెంచరీతో ఆకట్టుకోవడం, రిషబ్‌, సుందర్‌ల మధ్య విలువైన సెంచరీ భాగస్వామ్యం ఏర్పడడంతో స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ బౌలర్లు రోజంతా కష్టపడినా మొత్తంగా ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగారు.  

రిషబ్‌ పంత్‌ సెంచరీ..
టీమిండియా వి​కెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఎట్టకేలకు టెస్టుల్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ 83వ ఓవర్‌లో రూట్‌ వేసిన మొదటి బంతినే సిక్స్‌గా మలిచి పంత్‌ సెంచరీ సాధించాడు. వన్డే తరహాలో 117 బంతుల్లో 13 ఫోర్లు.. 2 సిక్సర్లతో సెంచరీ సాధించిన పంత్‌కు స్వదేశంలో తొలి సెంచరీ కావడం విశేషం. అయితే సెంచరీ సాధించిన మరుసటి ఓవర్లోనే అండర్సన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 7వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓవరాల్‌గా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల మధ్య 7వ వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. పంత్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతుండగా.. సుందర్‌ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పంత్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. పంత్‌ 94, సుందర్‌ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 47 పరుగులు ఆధిక్యంలో ఉంది.

పంత్‌ దూకుడు.. ఆధిక్యంలోకి టీమిండియా
టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దూకుడైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. హాప్‌ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడుతున్న పంత్‌ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో‌ చేసిన 205 స్కోరును దాటించాడు. ప్రస్తుతం భారత జట్టు 8 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. పంత్‌ 70 పరుగులతో ఆడుతుండగా.. సుందర్‌ 25 పరుగులతో అతనికి చక్కగా సహకరిస్తున్నాడు.  అంతకముందు పంత్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 71వ ఓవర్‌ 4వ బంతికి సింగిల్‌ తీసిన పంత్‌ 82 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్సర్‌తో కెరీర్‌లో 7వ అర్థ సెంచరీ సాధించాడు.

టీ విరామం.. టీమిండియా 153/6
టీ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ 37 పరుగులు, వాషింగ్టన్‌ సుందర్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అయితే విరామానికి ముందు అశ్విన్‌ 13 పరుగులు చేసి  జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పుడు భారత ఇన్నింగ్స్‌ భారమంతా పంత్‌, సుందర్‌లపైనే ఆధారపడి ఉంది.

టీమిండియా నాలుగో టెస్టులో నెమ్మదైన ఆటతీరును ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. రిషబ్‌ పంత్‌ 25, అశ్విన్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 66 పరుగులు వెనుకబడి ఉంది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 49 పరుగుల వద్ద ఔటై ఒక్క పరుగుతో అర్థ శతకం మిస్సయ్యాడు. రోహిత్‌ అవుట్‌తో 121 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అయితే లంచ్‌ విరామం అనంతరం రిషబ్‌ పంత్‌ ఫోర్లు, సిక్సర్‌తో దూకుడు ప్రదర్శించడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అయితే రోహిత్‌ అవుట్‌ కావడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 84 పరుగులు వెనుకబడి ఉంది.

లంచ్‌ విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన టీమిండియా ఇన్నింగ్స్‌ నిలకడగా కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్‌ 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 37, పంత్‌ 5 పరుగులు చేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 111 పరుగులు వెనుకబడి ఉంది.

లంచ్‌ విరామం.. రహానే ఔట్‌
టీమిండియా అజింక్య రహానే రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. పుజారా అవుటయ్యాకా క్రీజులోకి వచ్చిన రహానే మంచి టచ్‌లో కనిపించాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం ఏర్పడిన అనంతరం రహానే ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ 5వ బంతికి అండర్సన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో లంచ్‌ విరామానికి వెళ్లింది. రోహిత్‌ శర్మ 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

50 పరుగులు పూర్తి చేసిన టీమిండియా
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగుతుంది. ఇన్నింగ్స్‌ 31వ ఓవర్‌లో రోహిత్‌ సింగిల్‌ తీయడం ద్వారా భారత్‌  హఫ్‌ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 59/3గా ఉంది. రోహిత్‌ 27, రహానే 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి డకౌట్‌
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 41 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. స్టోక్స్‌ వేసిన 26వ ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లి ఫ్లిక్‌ చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తాకి కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడింది. రోహిత్‌ శర్మ 21, రహానే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. జాక్‌ లీచ్‌ వేసిన 26వ ఓవర్‌ చివరి బంతికి చతేశ్వర్‌ పుజారా ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్‌ అవుట్‌ ఇవ్వగా.. పుజారా రివ్యూ కోరాడు. రిప్లేలో లీచ్‌ వేసిన బంతి ఆఫ్‌ ​స్టంప్‌ మీద పడి మిడిల్‌ వికెట్‌ను గిరాటేస్తున్నట్లు కనిపించింది. దీంతో టీమిండియా  పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది. రోహిత్‌ శర్మ 20, కోహ్లి 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగోటెస్టులో రెండో  రోజు ఆట ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 17, పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.  తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.  లారెన్స్‌ (46 ; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షర్‌ పటేల్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 


బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై ఇంగ్లండ్‌ రోజు మొత్తం కూడా నిలబడలేకపోయింది. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత మొదటిసారి 200 పరుగులు దాటినా... భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఏమాత్రం సరిపోని స్కోరిది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ కలిసి ఏడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టగా, సిరాజ్‌ రెండు కీలక వికెట్లు తీశాడు. రెండో రోజు నిలబడి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్‌ చేతిలోకి వచ్చేసినట్లే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement