టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడం... భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు టి20ల్లో ఇదే దృశ్యం కనిపించడం చూస్తే టాస్ ఎంత కీలకంగా మారిందో అర్థమవుతుంది. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టాస్‌తో సంబంధం లేకుండా దేనికైనా సిద్ధంగా ఉండాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించి కోహ్లి జట్టు సిరీస్ ను ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరం.
అహ్మదాబాద్: టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో కొంత తడబడుతున్న భారత జట్టు సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. రెండో మ్యాచ్‌లో సునాయాస విజయం తర్వాత మరో సారి పేస్ బౌలింగ్‌కు తలవంచి గత మ్యాచ్‌లో ఓడిన జట్టు తర్వాతి పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం చేసుకుంటుంది.
రాహుల్‌కు చాన్స్ ఉందా!
భారత తుది జట్టుకు సంబంధించి చర్చ రేపుతున్న ఒకే ఒక్క అంశం కేఎల్ రాహుల్ ఫామ్. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతను 1, 0, 0 స్కోర్లకే అవుటయ్యాడు. అయితే గత మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి మద్దతుగా నిలిచారు. వారి మాటలను బట్టి చూస్తే రాహుల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. కానీ కోహ్లి సాధారణంగా చేసే వ్యాఖ్యలకు భిన్నంగా మ్యాచ్ రోజు వ్యూహాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా రాహుల్‌ను ఆడిస్తారని చెప్పలేం.
అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా రాకుండా గత పోరులో పక్కన పెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను రాహుల్ స్థానంలో తీసుకొని ఇషాన్ కిషన్‌తోనే ఓపెనింగ్ చేయించాలనే ప్రత్యామ్నాయం భారత్ ముందుంది. కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం కాగా, రోహిత్ కూడా చెలరేగితే తిరుగుండదు. కిషన్, పంత్, అయ్యర్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్ కూడా లయ అందుకుంటే జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్, సుందర్ పొదుపు పాటిస్తుండగా... చహల్ మాత్రమే తీవ్రంగా నిరాశపరుస్తున్నా డు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చహల్‌పై ఎదురుదాడి చేసి ఫలితం రాబట్టారు. శార్దుల్‌కు బదులుగా దీపక్ చహర్‌ను ఆడించాలని కూడా జట్టు భావిస్తోంది.
బలమైన బ్యాటింగ్...
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ పదును చూపించింది. రాయ్, మలాన్ విఫలమైనా... బట్లర్ ప్రదర్శించిన దూకుడుతో జట్టుకు సునాయాస విజయం దక్కింది. ఐపీఎల్ అనుభవంతో, ముఖ్యంగా స్పిన్‌ను అతను సమర్థంగా ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అదనపు బలంగా మారింది. టెస్టుల్లో ఘోరంగా విఫలమైన బెయిర్‌స్టో కూడా టి20ల్లో రాణిస్తున్నాడు. ఆపై మోర్గాన్, స్టోక్స్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు కాబట్టి వారిని నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. అన్నింటికి మంచి మార్క్ వుడ్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీస్తున్నాడు. ఆర్చర్ కూడా అంతే వేగంతో అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు మరోసారి చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. స్పిన్నర్ రషీద్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోవడంలో భారత్ విఫలమవుతోంది. అన్ని రంగాల్లో ఒకింత మనకంటే మెరుగ్గానే కనిపిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై కన్నేసింది.
కోహ్లి ర్యాంక్ 5
ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి మరోసారి టాప్–5లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించడంతో కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానంలో నిలిచాడు. టాప్–10లో భారత్ నుంచి కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ (4వ) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment