కృనాల్‌కు కరోనా | India Vs Sri Lanka: Krunal Pandya Tests Positive For COVID-19 Second T20 Postponed | Sakshi
Sakshi News home page

కృనాల్‌కు కరోనా

Published Wed, Jul 28 2021 1:01 AM | Last Updated on Wed, Jul 28 2021 1:11 AM

India Vs Sri Lanka: Krunal Pandya Tests Positive For COVID-19 Second T20 Postponed - Sakshi

కొలంబో: శ్రీలంక పర్యటనలోని భారత క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. టీమ్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా మంగళవారం కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. రెండో టి20 మరికొన్ని గంటల్లో ఆరంభమవుతుందనగా కృనాల్‌కు కోవిడ్‌–19 అని తేలడంతో మ్యాచ్‌ వాయిదా పడింది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కృనాల్‌ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. దాంతో అతడు సిరీస్‌లో మిగిలిన రెండు టి20లకు దూరమయ్యాడు. అంతేకాకుండా అతడు సిరీస్‌ పూర్తయ్యాక మిగిలిన భారత క్రికెటర్లతో కలిసి స్వదేశానికి రావడం లేదు. ఏడు రోజుల క్వారంటైన్‌ పూర్తయ్యాక నిర్వహించే ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌గా రిపోర్టు వస్తేనే కృనాల్‌ భారత్‌కు వచ్చేందుకు వీలవుతుంది.

అసలేం జరిగింది... 
తనకు కాస్త గొంతు నొప్పిగా ఉందంటూ మంగళవారం ఉదయం కృనాల్‌ భారత మెడికల్‌ టీమ్‌కు తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన మెడికల్‌ సిబ్బంది అతడికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టును నిర్వహించింది. అందులో కృనాల్‌ పాజిటివ్‌గా తేలాడు. కృనాల్‌తో ఎనిమిది మంది క్రికెటర్లు సన్నిహితంగా మెలిగినట్లు భారత మెడికల్‌ టీమ్‌ గుర్తించింది. వీరికి ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా అంద రికీ నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయితే వీరు కూడా మిగిలిన రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు సమాచారం. వీరి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచారు. నేడు రెండో టి20 జరగనుంది. 

ఎలా సోకింది... 
కృనాల్‌కు కరోనా ఎలా సోకిందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సిరీస్‌ బయో బబుల్‌లో జరుగుతుండటంతో బయటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం లేదు. అయితే భారత క్రికెటర్లు ఉంటున్న తాజ్‌ సముద్ర హోటల్‌లో కృనాల్‌ కరోనా బారిన పడే అవకాశం ఉంది. లేకపోతే జట్టును గ్రౌండ్‌కు తీసుకొచ్చే బస్‌ డ్రైవర్‌ ద్వారా లేదా మైదానంలో టీమ్‌కు భోజన వసతిని ఏర్పాటు చేసే క్యాటరింగ్‌ సిబ్బంది ద్వారా సోకినట్లు భావిస్తున్నారు. 

సూర్య, పృథ్వీ షాలకు క్వారంటైన్‌ తప్పదా? 
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఎంపికై... ఆ తర్వాత గాయాలతో దూరమైన భారత క్రికెటర్లు శుబ్‌మన్‌ గిల్, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానాల్లో సూర్యకుమార్‌ యాదవ్, పృథ్వీ షాలకు పిలుపొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు శ్రీలంక పర్యటనలో ఉండగా... టి20 సిరీస్‌ ముగిసిన వెంటనే అక్కడి నుంచే నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిద్దరు కూడా సిరీస్‌ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌కు వెళ్లాక మళ్లీ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని... డర్హమ్‌లో ఉన్న జట్టుతో కలవొచ్చని బీసీసీఐ ఇది వరకే స్పష్టం చేసింది. అయితే కృనాల్‌ పాజిటివ్‌తో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ సిరీస్‌ ముగిశాక సూర్యకుమార్, పృథ్వీ షా ఇంగ్లండ్‌కు వెళ్లినా... అక్కడ 10 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement