India Vs Sri Lanka T20 Series 1St T20, Predictions In Telugu - Sakshi
Sakshi News home page

Ind Vs SL 1st T20: తిరుగులేని టీమిండియా.. లంకతో సిరీస్‌ ఏకపక్షమేనా

Published Thu, Feb 24 2022 7:30 AM | Last Updated on Thu, Feb 24 2022 11:47 AM

India Vs Sri Lanka T20 Series 1st T20 - Sakshi

టి20 ప్రపంచకప్‌కు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి వేర్వేరు కూర్పులతో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైన భారత్‌ ముందు మరో సిరీస్‌ నిలిచింది. పాత ప్రత్యర్థి శ్రీలంకతో స్వదేశంలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు నేటితో తెర లేవనుంది. విండీస్‌ను వరుసగా ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో చిత్తు చేసిన టీమిండియా జోరు మీదుండగా... ఆసీస్‌ చేతిలో సిరీస్‌ కోల్పోయిన లంక జట్టు భారత గడ్డపై ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉంది.

లక్నో: కోహ్లి, పంత్‌ గైర్హాజరు... గాయాలతో దీపక్‌ చహర్, సూర్యకుమార్‌ దూరం... బుమ్రా, జడేజా పునరాగమనం... ఈ నేపథ్యంలో భారత జట్టు శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి వాజ్‌పేయి స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. భారత్‌ గత మూడు టి20ల్లో విండీస్‌పై గెలవగా... ఆసీస్‌పై తాము ఆడిన చివరి టి20లో లంక నెగ్గింది.  

ఎవరికి అవకాశం?  
విండీస్‌లో జరిగిన చివరి టి20తో పోలిస్తే భారత జట్టులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్‌ తమ స్థానాలను నిలబెట్టుకోవడం ఖాయం. కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ కొనసాగుతాడు. మీడియా సమావేశంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సూర్యకుమార్‌ స్థానంలో పూర్తి స్థాయి బ్యాటర్‌గా సంజు సామ్సన్‌కు అవకాశం దక్కవచ్చు.

ఈసారి గత మ్యాచ్‌ ప్రయోగాన్ని పక్కన పెట్టి రోహిత్‌ మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. దీపక్‌ చహర్‌కు బదులుగా బుమ్రా జట్టులోకి వస్తాడు. విశ్రాంతి తర్వాత మ్యాచ్‌ ఆడబోతున్న బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే లంకకు కష్టాలు తప్పవు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండటంతో ఈ సిరీస్‌ కూడా ఏకపక్షంగా సాగినా ఆశ్చర్యం లేదు.

శ్రీలంక టీమ్‌లో ఎక్కువ మందికి తగినంత అనుభవం లేదు. అయితే ఆసీస్‌తో చివరి మ్యాచ్‌ గెలిచిన ఆ జట్టులో కాస్త ఉత్సాహం పెరిగింది. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా ఆ టీమ్‌నే బరిలోకి దించే అవకాశం ఉంది. ఓపెనర్లు కుశాల్‌ మెండిస్, నిసాంకాలతో పాటు కమిల్‌ మిశారాలపై జట్టు బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్లు అసలంక, లియనాగే ధాటిగా ఆడగల సమర్థులు.

ఆసీస్‌ గడ్డపై ముగ్గురు పేసర్లతో ఆడిన లంక ఇక్కడ కూడా అలాగే చేస్తుందా లేక అదనపు స్పిన్నర్‌ను చేరుస్తుందా చూడాలి. కరోనా బారిన పడటంతో హసరంగ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్‌పై పెద్దగా ఆడని వీరంతా బలమైన ప్రత్యర్థిని ఎలా నిలువరిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement