India vs West Indies: Ind Will Play 1000th ODI In Ahmedabad Details Here - Sakshi
Sakshi News home page

IND vs WI: విండీస్‌తో భార‌త్ తొలి పోరు.. రోహిత్ వ‌చ్చేశాడు!

Published Sun, Feb 6 2022 5:03 AM | Last Updated on Sun, Feb 6 2022 12:32 PM

India vs West Indies 1000th ODI - Sakshi

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ చరిత్రలో భారత్‌ ‘సహస్ర’ సమరానికి సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నేడు జరుగనుంది. కొత్త నాయకుడు రోహిత్‌ శర్మ తనకు లభించిన ఈ వెయ్యో వన్డేలో గెలిచి... తన సారథ్యానికి విజయబాట వేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ విజయంతో తుడిచి పెట్టాలని టీమిండియా సహచరులు పట్టుదలతో ఉన్నారు.

అహ్మదాబాద్‌: దక్షిణాఫ్రికా గడ్డపై క్లీన్‌స్వీప్‌ అయిన భారత జట్టును స్వదేశంలో కోవిడ్‌ చుట్టుముట్టింది. అయినా సరే సొంతగడ్డ అనుకూలతలతో, కొత్తగా రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా 1000వ వన్డే పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ టి20 సిరీస్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని కరీబియన్‌ జట్టు తహతహలాడుతోంది. ఇరు జట్లను అనుభవజ్ఞుల కొరత వేధిస్తోంది.

వ్యక్తిగత కారణాలతో కేఎల్‌ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమవగా... మయాంక్‌ అగర్వాల్‌ క్వారంటైన్‌ పూర్తి కాలేదు. దీంతో భారత్‌ ఓపెనింగ్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇషాన్‌ కిషన్‌. కెప్టెన్‌ రోహిత్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు బరిలోకి దిగే అవకాశం రాగా... గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ తుది బెర్త్‌ కోసం దీపక్‌ హుడాతో పోటీపడనున్నాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు కావడంతో ఒకరికే ఛాన్సుంది. మరోవైపు విండీస్‌ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్‌ లూయిస్‌ దూరమయ్యారు. దీంతో కొత్త కుర్రాళ్లు ఒడియన్‌ స్మిత్, రొమరియో షెఫర్డ్, బ్రాండన్‌ కింగ్‌లతో భారత్‌తో సమరానికి సిద్ధమైంది.

999:ఇప్పటివరకు భారత్‌ 999 వన్డేలు ఆడింది. 518 మ్యాచ్‌ల్లో గెలిచింది. 431 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. స్వదేశంలో భారత్‌ 345 వన్డేలు ఆడింది. ఇందులో 202 విజయాలు, 131 పరాజయాలు ఉన్నాయి. 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. 9 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.  విదేశాల్లో భారత్‌ 654 వన్డేలు ఆడింది. ఇందులో 316 విజయాలు, 300 పరాజయాలు ఉన్నాయి. 6 మ్యాచ్‌లు ‘టై’కాగా, 32 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

1974: భారత్‌ తమ తొలి వన్డేను 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లతో ఓడింది. వన్డేల్లో భారత్‌ తొలి విజయాన్ని 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్‌ ఆఫ్రికాతో మ్యాచ్‌లో అందుకుంది.

19:భారత్‌ ఇప్పటి వరకు మొత్తం 19 దేశాలతో వన్డే మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకతో అత్యధికంగా 162 మ్యాచ్‌లను భారత్‌ ఆడింది. ఆ తర్వాతి వరుసలో ఆస్ట్రేలియా (143), వెస్టిండీస్‌ (133), పాకిస్తాన్‌ (132), న్యూజిలాండ్‌ (110), ఇంగ్లండ్‌ (103), దక్షిణాఫ్రికా (87), జింబాబ్వే (63), బంగ్లాదేశ్‌ (36), కెన్యా (13), అఫ్గానిస్తాన్‌ (3), ఐర్లాండ్‌ (3), యూఏఈ (3), నెదర్లాండ్స్‌ (2), హాంకాంగ్‌ (2), బెర్ముడా (1), ఈస్ట్‌ ఆఫ్రికా (1), నమీబియా (1), స్కాట్లాండ్‌ (1) ఉన్నాయి.  

418: వన్డేల్లో భారత్‌ సాధించిన అత్యధిక స్కోరు. 2011 డిసెంబర్‌ 8న ఇండోర్‌ లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 418 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (219) డబుల్‌ సెంచరీ సాధించాడు.

26: వన్డేల్లో భారత జట్టుకు 26 మంది కెప్టెన్‌గా వ్యవహరించారు. ధోని అత్యధికంగా 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఆ తర్వాతి వరుసలో అజహరుద్దీన్‌ (174), గంగూలీ (146), కోహ్లి (95), ద్రవిడ్‌ (79), కపిల్‌ దేవ్‌ (74), సచిన్‌  (73), గావస్కర్‌ (37), వెంగ్‌సర్కార్‌ (18), అజయ్‌ జడేజా (13), శ్రీకాంత్‌ (13), రైనా (12), సెహ్వాగ్‌ (12), రవిశాస్త్రి (11), రోహిత్‌ శర్మ (10), వెంకట్రాఘవన్‌ (7), గంభీర్‌ (6), బేడీ (4),  ధావన్‌ (3), కేఎల్‌ రాహుల్‌ (3), రహానే (3), వాడేకర్‌ (2), అమర్‌నాథ్‌ (1), కిర్మాణీ (1),  విశ్వనాథ్‌ (1),  కుంబ్లే (1) ఉన్నారు.

54: వన్డేల్లో భారత్‌ అత్యల్ప స్కోరు. 2000 అక్టోబర్‌ 29న షార్జాలో శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్‌ 26.3 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement