ప్రపంచ చాంపియన్‌షిప్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది.
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి.
జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు.
తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్–18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ముగిసిన ప్రణయ్ పోరాటం
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్‌కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ సీజన్‌లో గొప్ప ఫామ్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్‌కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్‌లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్‌ను దక్కించుకుంది.
నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది.
అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఎనిమిదోసారి
కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచారు.
చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..?
Comments
Please login to add a commentAdd a comment