
పూణే: తొలి వన్డేలో టీమిండియా చేతిలో 66 పరుగుల తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లీష్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేకు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ దూరంకానున్నారని తెలుస్తోంది. పూణే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. మోర్గాన్‌కు కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.
మరోవైపు బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ భుజం పైభాగం(కాలర్‌బోన్)కు గాయమైంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని ఇంగ్లండ్ జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఇదే జరిగితే రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అసలే నిలకడలేమితో సతమతమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలినట్లైంది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా శుక్రవారం(మార్చి 26) రెండో వన్డే జరుగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment