ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. టెక్సస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లో స్పెయిన్ చేతిలో 1-0తో పోర్చుగల్ ఓటమి చవిచూసింది. ఆఖరి నిమిషంలో స్పెయిన్ తరఫున మైకెల్ మెరినో గోల్ కొట్టడంతో పోర్చుగల్‌కు నిరాశే ఎదురైంది.
ఇప్పటికే 2026 ఫిఫా ప్రపంచకప్ తనకు చివరిదని ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ఓటమి తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. ఇది తన చివరి వరల్డ్‌కప్ అన్న మాట వాస్తవమేనని, కానీ రిటైర్మెంట్‌కు ఇంకా సమయం ఉందంటూ ఆసక్తికరంగా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు.

‘ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం బాధగా ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. నా వంతు కృషి చేశాననే సంతృప్తితోనే ఉన్నాను. ఇది నా చివరి ప్రపంచ కప్ అన్నది వాస్తవం. కానీ ఇప్పుడే రిటైర్‌మెంట్ ఇచ్చేసే ఆలోచన లేదు. ఇక నా కుటుంబంతో కొంత సమయం గడిపి.. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. భావోద్వేగంలో తొందరపడి ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను.
క్రిస్టియానో రొనాల్డోకు ముందు కూడా పోర్చుగల్ ఒక్క టైటిల్ గెలవలేదు. నా కెరీర్‌లో దేశానికి మూడు టైటిళ్లు అందించా. 2016లో గెలిచిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ నాకు వరల్డ్ కప్‌తో సమానమైన గొప్ప విజయంగా భావిస్తాను. అలాగే రెండు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా మా దేశ ఫుట్‌బాల్ చరిత్రలో ప్రత్యేకమైనవే’ అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.

రొనాల్డో నెట్‌వర్త్ ఎంతంటే?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో నంబర్‌వన్ స్థానంలో ఉంటాడు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన జాబితా ప్రకారం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా నిలిచాడు. 2026 వరకు చూసుకుంటే అతడి నెట్‌వర్త్ 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 10 వేల నుంచి 13 వేల కోట్ల మధ్య) వరకు ఉండొచ్చు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ రొనాల్డో ఆస్తలు విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. 2025 జూన్‌లో ఒక బిలియన్ మార్క్ దాటిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు.
ఆ ఏడాది అల్ నసర్ క్లబ్‌తో ఒప్పందం రొనాల్డో నెట్‌వర్త్ విలువను అమాంతం పెంచేసింది. అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల కాలానికి గానూ రొనాల్డో చేసుకున్న ఒప్పందం విలువ దాదాపు 400 మిలియన్ డాలర్ల నుంచి 620 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3వేల నుంచి ఆరు వేల కోట్ల మధ్య) మధ్య ఉంటుంది. ఇక క్లబ్ తరఫున ఆడుతూ రొనాల్డో ఏడాదికి వార్షిక వేతనం కింద 200 నుంచి 235 మిలియన్ డాలర్ల (సుమారు 1800 నుంచి 2వేల కోట్ల రూపాయల మధ్య)ను పారితోషికంగా అందుకుంటున్నాడు.

2003లో రొనాల్డో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా మారిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జూవెంటస్, అల్‌నసర్ క్లబ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ దాదాపు 550 మిలియన్ డాలర్లకు పైగా ఉండేది. ఇక నైక్‌తో చాలా ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందంతో ఒక బిలియన్ డాలర్ల విలువను దాటేశాడు. ఇది జీవితకాలం ఒప్పందం కావడంతో అతడు ఆడుతున్నా, ఆడకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక రొనాల్డో బ్రాండ్ హోటల్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, జిమ్ వరకు విస్తరించి ఉంది.

రొనాల్డోకు చెందిన హోటళ్లు లిస్బన్, మదీరా, మాడ్రిడ్, న్యూయార్క్, మారకేశ్‌లలో కోట్లలో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఎండార్స్‌మెంట్లలో భాగమైన హెర్బ్‌లైఫ్, క్లియర్, ఆర్మానీ ప్రొడక్ట్‌ల ద్వారా 50 నుంచి 60 మిలియన్ల డాలర్లు పొందుతున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగా రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచే రొనాల్డో ఏడాదికి 125 నుంచి 175 మిలియన్ డాలర్ల (సుమారు వెయ్యి నుంచి 1600 కోట్ల రూపాయల మధ్య)ను సంపాదిస్తున్నాడు.
Cristiano Ronaldo:
🗣️ "I've won three titles with Portugal. Before Cristiano, Portugal hadn't won anything.
The biggest title I won with the National Team was Euro 2016. FOR ME, IT HAS THE SAME DIMENSION AS A WORLD CUP." 😳🇵🇹 pic.twitter.com/kqDd3Oo5Qf— World Cup HQ (@WorldCup26HQ) July 6, 2026


